యువకులు సరదాగా తాగే బీర్‌తో పొట్ట పెరుగుతుంది..
యువకులు సరదాగా తాగే బీర్ వలన ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో దుష్ప్రభావాలు కూడా ఇంకా ఎక్కువే ఉన్నాయి. తక్షణ సమస్యలే కాక దీర్ఘకాలిక సమస్యలు కూడా బీర్ వలన వస్తాయి. బీర్ తాగితే కొంత మేరకు మంచిదే అయినప్పటికీ ఎక్కువగా తీసుకోవడం వలన వచ్చే ఫలితాలు మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అల్ప సమస్యల నుండి ప్రాణాంతక సమస్యల వరకూ కారణమవుతుంది. దీనిలో ఆల్కహాల్ ఉన్నందున శరీరంలో షుగర్ స్థాయిలు త్వరగా తగ్గి ఆకలి పెంచుతుంది.
ఎక్కువగా తినడం వలన ఊబకాయానికి దారితీస్తుంది. పొట్ట పెరిగిపోతుంది. తరచుగా బీర్ తాగడం వలన మెదడు కణాలు దెబ్బతింటాయి. దాని వలన మీరు చేసే పనులపై దృష్టి కేంద్రీకరించలేరు. ఆల్కహాల్‌ని ఎక్కువగా తీసుకుంటే శరీర వ్యవస్థ డీహైడ్రేట్ అవుతుంది. ఉదయం లేవగానే చాలా తలనొప్పి, కడుపులో వికారం, నోరు ఎండిపోవడం వంటి చాలా లక్షణాలు కనిపిస్తాయి.
అలసటకు గురవుతారు. హ్యాంగ్ ఓవర్ వస్తుంది కనుక బీర్‌కి దూరంగా ఉండటమే మంచిది. నిద్రాభంగం కూడా బీర్ వలన వస్తుంది. రాత్రిపూట తాగితే తరచూ బాత్ రూమ్‌కి వెళ్లవలసి వస్తుంది. స్ట్రెస్ హార్మోన్‌లను విడుదల చేస్తుంది. నిద్రకు దూరమవుతారు.
హార్ట్ రేటు కూడా పెరిగి రక్త పోటు స్థాయి పెరుగుతుంది. ఆల్కహాల్ తాగడం వలన స్టమక్ యాసిడ్ ఎక్కువగా ఉత్పత్తి అయి గుండె మంటకు కారణమవుతుంది. బీర్ తాగడం వలన లివర్ పాడయ్యే అవకాశాలు ఎక్కువ. కొన్ని బీర్లు లివర్‌కి మంచి చేసినప్పటికీ జాగ్రత్తలు పాటిస్తే మంచిది.