శనివారం, 9 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (17:00 IST)

టీవీని ఎక్కువ సమయం చూస్తూ స్నాక్స్ తినేవారు.. కాస్త జాగ్రత్త..!

సాధారణంగా మనలో చాలా మంది టీవీ చూసే సమయంలో అదే పనిగా స్నాక్స్‌ని లాంగించేస్తుంటారు. అయితే అలాంటి వారు ఇక జాగ్రత్త పడక తప్పదు. టీవీ చూస్తూ స్నాక్స్ తినడం వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. ఇది సరదాకి చెబుతున్న విషయం కాదు సుమీ..సైంటిస్టులు పరిశోధనలు నిర్వహించి ఈ విషయాన్ని వెల్లడించారు.
 
బ్రెజిల్ దేశానికి చెందిన పలువురు శాస్త్రవేత్తలు అక్కడే నివాసం ఉంటున్న 12 నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సున్న 33,900 మంది టీనేజర్ల ఆహారపు అలవాట్లు, వారికి ఉన్న వ్యాధులు, వారి జీవనశైలి తదితర అంశాల సమాచారాన్ని మొత్తం సేకరించి విశ్లేషించారు. దీంతో అసలు విషయం బయటపడింది. 
 
నిత్యం 6 గంటల కన్నా ఎక్కువగా టీవీ చూస్తూ ఆ సమయంలో స్నాక్స్‌ తినేవారిలో కొందరికి మెటబాలిక్‌ సిండ్రోమ్‌ ఉన్నట్లు గుర్తించారు. మెటబాలిక్‌ సిండ్రోమ్‌ ఉంటే డయాబెటిస్‌, గుండె జబ్బులు త్వరగా వస్తాయని శాస్త్రవేత్తలు తేల్చారు. కనుక టీవీ ఎక్కువగా చూస్తూ ఆ సమయంలో స్నాక్స్‌ తినేవారు ఆ అలవాటును మానుకోవాలని సైంటిస్టులు సూచిస్తున్నారు.