బీట్‌రూట్ రసం తాగిన 24 గంటల్లో..?
కూరగాయలన్నీ పోషణను మాత్రమే ఇస్తాయి అనుకుంటే పొరపాటు. చాలా కూరగాయలు అనేక వ్యాధులకు ఔషధంగా కూడా పనిచేస్తాయి. ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా సహజసిద్ధంగా వ్యాధులను నయం చేస్తాయి. వాటిలో బీట్ రూట్ కూడా ఒకటి. అధ్యయనాల ప్రకారం నైట్రేట్ అధికంగా ఉన్న కూరగాయలను తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది.
మన శరీరానికి నైట్రేట్‌ను నైట్రిట్ అనే రసాయనంగా ఆ తర్వాత నైట్రిక్ ఆక్సైడ్‌గా మార్చే గుణం ఉంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ రక్తనాళాలను వ్యాకోచింపచేసి రక్తపోటును తగ్గిస్తుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారికి మాత్రలకు బదులుగా 200 మిలీ బీట్‌రూట్ రసాన్ని ఇచ్చి 24 గంటలపాటు పరిశీలనలో ఉంచారు.
ఆ రసం తీసుకున్న కేవలం మూడు నుంచి ఆరు గంటల్లోనే 10 ఎంఎంహెచ్‌జి రక్తపోటు తగ్గింది. అంతే కాకుండా మరో 24 గంటలపాటు రక్తపోటు నియంత్రణలో ఉంది. అందువల్ల హైబీపీతో బాధపడేవారు నైట్రేట్ ఎక్కువగా ఉన్న కూరగాయలు, ఆకుకూరలు తరచుగా తినమని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.