సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 21 మే 2022 (22:01 IST)

International Tea Day: ఈ 10 రకాల టీలను తాగి చూడండి

Lemon Grass Tea
టీ అనేది ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాలలో ఒకటి. భారతదేశంలో ఇది ఒక సంస్కృతిగా కూడా పరిగణించబడుతుంది. 2019 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మే 21ని అంతర్జాతీయ టీ దినోత్సవంగా గుర్తించింది. టీ ఉత్పత్తి, వినియోగాన్ని ప్రోత్సహించడానికి... పేదరికం మరియు ఆకలితో పోరాడడంలో దాని ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించే ప్రయత్నంలో ఉంది.
 
 
గ్రీన్ టీ, బ్లాక్ టీ, సాంప్రదాయ టీలను తయారు చేస్తారు. హెర్బల్ టీలు, మూలికలు, సుగంధ ద్రవ్యాలు, పువ్వులతో రుచిగా ఉంటాయి. ఈ దిగువన చూడండి 10 రకాల టీలు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
 
1. మందార టీ
రక్తపోటును నియంత్రించాలంటే.. మందార టీని సేవించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మందారంలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. టేబుల్ స్పూన్ ఎండిన మందార పూల రెక్కలను కప్పు నీళ్లలో వేసి, పది నిమిషాల పాటు వేడిచేసి, చల్లారాక తాగండి. రోజుకు రెండు కప్పుల మందార టీ తాగితే రక్తపోటు అదుపులో ఉంటుంది. 
 
మందార పూల టీని నిత్యం తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో అధికంగా ఉన్న కొవ్వు క‌రిగి బ‌రువు త‌గ్గుతారు. ఇది గ్లూకోజ్‌, ఫ్యాట్స్ వంటి వాటిని శ‌రీరంలో త్వ‌ర‌గా క‌ల‌వ‌కుండా చేస్తుంది. దీంతో దేహంలో కొవ్వు ఎక్కువ‌గా పేరుకుపోదు. అంతేకాకుండా మందార పూల టీ వ‌ల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు. చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. 
 
మ‌ధుమేహంతో బాధ‌ప‌డుతున్న వారికి ఎంతో మేలు చేస్తుంది. ప‌లు ర‌కాల క్యాన్స‌ర్‌ల‌కు మందుగా ప‌నిచేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేస్తుంది. శ‌రీరానికి శ‌క్తిని, ఉత్తేజాన్ని ఇస్తుంది.
 
2. అల్లం టీ
జలుబు, జ్వరం, గొంతునొప్పి, తలనొప్పితో బాధపడేవారు అల్లం టీ తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. బాగా జలుబు, దగ్గుతో బాధపడుతున్నవారు రోజుకు మూడుసార్లు అల్లంతో తయారైన హెర్బల్ టీని తీసుకుంటే ఫలితం వుంటుంది. ఐతే సమస్య వుంది కదా అని అల్లం టీని అదే పనిగా తాగరాదు. రోజులో నాలుగుసార్లకు మించి తాగితే ఆరోగ్యానికి చేటు చేస్తుంది. కడుపులో అల్సర్ ఉన్న వాళ్లు అసలు తాగకూడదు.
 
ఆస్తమా, దగ్గులను తగ్గించాలంటే అల్లం టీ రోజూ తేనెతో కలిపి తీసుకోవాలి. నీరసంగా ఉన్నవారు అల్లం టీ త్రాగటం వల్ల ఉత్సాహం వస్తుంది. ఛాతిలో మంట, అజీర్ణం వంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే అల్లం టీ తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అల్లం టీని సేవించడం ద్వారా మోకాలి నొప్పులు, కీళ్ల నొప్పులు రావు. అంతేకాదు ఏ అనారోగ్యంతో బాధపడేవారైనా అల్లం టీని సేవిస్తే ఉపశమనం కలుగుతుంది.
 
3. పసుపు టీ
ప్రతీ వంటల్లో తప్పనిసరిగా వాడే పదార్థామంటే అది పసుపే. పసుపుతో ఇతరత్రా బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే వేలాది సంవత్సరాలుగా భారతీయులు పసుపును ఔషధంగా ఉపయోగిస్తుంటారు. పసుపులో లభించే కుర్కమిన్ అనే పదార్థంలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతో సహాయపడుతాయి.
 
పసుపుతో టీ తయారుచేసి తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. బరువు తగ్గించడంతోపాటు, ఒబిసిటీతో పోరాడడానికి పసుపు టీ చాలా మంచిది. చాలామంది అధిక బరువు తగ్గించాలని ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తుంటారు. వాటిన్నింటిని వదిలేసి పసుపు టీ తాగితే చాలంటున్నారు వైద్యులు. ఎందుకంటే.. అధిక బరువును తగ్గించడంలో పసుపు టీ దోహదం చేస్తుంది. దాంతోపాటు గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది.
 
ఇన్ని ప్రయోజనాలు గల పసుపు టీని ఎలా చేయాలో తెలుసుకుందాం.. 4 కప్పుల నీటిని వేడిచేసి అందులో 2 స్పూన్ల పసుపు పొడిని కలుపుకోవాలి. దాదాపు 10 నిమిషాలపాటు ఈ మిశ్రమాన్ని వేడి చేయాలి. ఆ తరువాత దాన్ని గిన్నెలోకి తీసుకుని 5 నిమిషాలపాటు చల్లార్చాలి. ఆపై అల్లం ముక్క, కొద్దిగా తేనె కూడా కలపొచ్చు. ఇలా తయారుచేసిన టీని రోజూ తాగితే ఆరోగ్యం మెరుగవుతుంది.
 
4. బాదం టీ
బాదం టీ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే... దీర్ఘకాలిక వ్యాధులను నివారించడం, మంటను తగ్గించడం, శరీరాన్ని నిర్విషీకరణ చేయడం మరియు వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపజేయడం వంటి వాటి సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. యాంటీ ఏజింగ్ - ఈ టీలో ఫైటోస్టెరాల్స్ వంటి అనేక యాంటీఆక్సిడెంట్లు, అలాగే విటమిన్ ఇ వంటి యాంటీఆక్సిడెంట్ విటమిన్లు కనిపిస్తాయి. ఇవి చర్మంలోని ఫ్రీ రాడికల్స్ ప్రభావాలను తగ్గించగలవు.
 
బాదం టీ మూత్రపిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది జీవక్రియను వేగవంతం చేయడంలో కూడా సహాయపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధి- టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడి, గుండె జబ్బులు, ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
 
5. మునగ ఆకు టీ
ఇపుడు మోరింగా(మునగ ఆకుల)టీ ప్రాచుర్యంలోకి వచ్చింది. దీనికి కారణం ఈ టీని సేవించడం వల్ల ఎన్నో ప్రయజాలుండటమే. ఈ టీని తాగితే బరువు తగ్గించుకోవచ్చు. రక్తపోటును అదుపులో వుంచుంది. రక్తంలో చక్కెరస్థాయిలను అదుపులో పెడుతుంది. కొవ్వులు చేరకుండా అడ్డుకుంటుంది. మానసిక ఆందోళనను తగ్గిస్తుంది.
 
ఈ టీని తయారు చేసుకోవడం ఈజీనే. ఈ రోజుల్లో మోరింగా పౌడర్ ఆన్‌లైన్‌లో, కిరాణా దుకాణాల్లో విస్తృతంగా అందుబాటులో ఉంది. దీనిని ఫిల్టర్ చేసిన నీటిలో ఉడకబెట్టి, ఆపై ఒడపోసి గ్రీన్ టీని పొందవచ్చు, ఇదే మోరింగా టీ. 
 
అయితే మీకు బ్రాండ్లు, ప్యాకేజ్డ్ పౌడర్‌లపై నమ్మకం లేకపోతే మీరు ఇంట్లో మోరింగా పౌడర్‌ను కూడా తయారు చేసుకోవచ్చు. మీరు చేయవలసిందల్లా కొన్ని తాజా మునగ ఆకులను తీసుకోవాలి. వాటిని డీహైడ్రేట్ చేసి, ఆపై వాటిని పొడి చేసి రుబ్బుకోవాలి. ఆ తర్వాత దానిని ఉడకబెట్టాలి. తదుపరి వడకట్టి తీస్తే అదే మోరింగా టీ(మునగ ఆకులు).
 
కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ టీని ఆషామాషీగా తాగేయకూడదు. ఏదయినా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వేధిస్తుంటే మాత్రం ఖచ్చితంగా డైటీషియన్ లేదా మీ వైద్యుడిని సంప్రదించిన తర్వాతే ఈ టీ తీసుకోవాలి.
 
6. మల్లెపూవు టీ
బ్లాక్ టీ, జింజిర్ టీ, తేయాకు టీ, మందార ఆకుల టీ.. ఇలా రకరకాల టీల గురించి మనకు తెలుసు. ఈ టీలను తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసు. ఐతే మల్లెపూలతో చేసే టీలో ఆరోగ్య రహస్యాలున్నాయంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు.
 
ఈ మల్లెపూల టీ తీసుకోవడం వల్ల ఉపయోగాలను చూద్దాం. రక్తంలో చక్కెర శాతాన్ని అదుపులో ఉంచుతుంది. కనుక మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది. రక్తంలో ఎల్.డి.ఎల్. కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. అందుచేత హృదయసంబంధ వ్యాధులను, పక్షవాతాన్ని రానీయదు.
 
వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. లావు తగ్గాలనుకునే వారికి ఈ టీ ఎంతో మంచిది. తొందరగా బరువు తగ్గటానికి సహాయపడుతుంది. దీనితో పుక్కిలిస్తే చిగుళ్ళ వ్యాధులు, దంతక్షయం రాకుండా కాపాడుతుంది. అల్సర్, కేన్సర్ వంటివి రాకుండా సహాయపడుతుంది. జలుబు, దగ్గు, అలర్జీల నుండి ఉపశమనాన్ని ఇస్తుంది.
 
కండరాల నొప్పులను, కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది. రొమాంటిక్ భావాలు పెంచుతుంది. మల్లెల నూనెను కీళ్ళ, కండరాల నెప్పులకు రాస్తే ఉపశమనం కలుగుతుంది.
 
7. లెమన్ గ్రాస్ టీ
లెమన్‌గ్రాస్ ఆకుల ద్వారా త‌యారుచేసే టీని రోజూ త్రాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ టీ తాగ‌డం వ‌ల్ల ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రంతో పాటు త‌ల‌నొప్పి, కండ‌రాల నొప్పులు, క‌డుపు నొప్పి త‌గ్గుతాయి. 
 
అంతేకాకుండా ర‌క్త ప్రసరణ కూడా మెరుగు ప‌డుతుంది. ప‌లు ర‌కాల క్యాన్స‌ర్లు రాకుండా ఉంటాయి. ఇంకా కిడ్నీ స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. శ‌రీరంలో ఉన్న వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు వెళ్లిపోతాయి. శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్ త‌గ్గడమే కాకుండా డ‌యాబెటిస్ కంట్రోల్ అవుతుంది.
 
8. దాల్చిన చెక్క టీ
దాల్చిన చెక్క టీ ఒంట్లో వుండే పరాన్నజీవులన్నింటినీ చంపేసి, విషపూరిత పదార్థాల నుంచి శరీరాన్ని పరిశుభ్రం చేస్తుంది. ముక్కుదిబ్బడ, వాంతులు వంటి చిన్నచిన్నవి మన జోలికి రావు. క్యాన్సర్‌, మానసిక వైకల్యం వంటివి రాకుండా శరీరాన్ని సంసిద్ధం చేస్తుంది ఈ పానీయం. అయితే ఈ టీ తయారు చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ టీని ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.
 
కావాల్సిన పదార్థాలు:
500 మిల్లీ లీటర్ల నీళ్ళు
స్పూన్‌ దాల్చిన చెక్క
సగం స్పూన్‌ అల్లం
1/6వ వంతు పసుపు
చిటికెడు యాలకుల పొడి
సగం కప్పు పాలు
కొద్దిగా తేనె 
 
తయారీ విధానం:
పైన పేర్కొన్న వాటన్నింటినీ నీటిలో కలిపి టీలా మరిగించుకొని వడపోసి తాగడమే. కావాలనుకుంటే దీనికి అదనంగా వేడిపాలు చేర్చుకోవచ్చు. రోజుకి ఒకటిరెండుసార్లు తాగితే సరిపోతుంది. తిండీ తిప్పలు మానేసి అదొక్కటే తాగరాదు. టీ తరహాలో తాగితే చాలు. పంచదార మాత్రం ఇందులో వెయ్య‌కూడ‌దని గమనించండి.
 
9. గ్రీన్ టీ
1. గ్రీన్ టీ ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నిర్దుష్టంగా ఉంచుతుంది. గ్రీన్ టీకి శరీరంలోని క్రొవ్వు మరియు రక్తపీడనాన్ని తగ్గించే శక్తి వుంది.
 
2. గ్రీన్ టీ అధిక రక్తపీడనాన్ని మరియు కాంజేస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ వంటి గుండె సంబంధిత వ్యాధులను రాకుండా ఆపుతుంది.
 
3. గ్రీన్ టీ శరీరాన్ని సన్నగా మరియు ఫిట్‌గా ఉంచుతుంది. ఇది జీవక్రియలో పాల్గొని కొవ్వు పదార్ధాల నుండి ఎక్కువ క్యాలరీలను కరిగిస్తుంది. త్వరగా బరువు తగ్గటానికి ఈ టీ అద్భుతంగా పనిచేస్తుంది.
 
4. గ్రీన్ టీ తాగటం వల్ల మెదడుకు చాలా మంచిది. ఇది మతిమరుపు రాకుండా చేస్తుంది.
 
5. కీళ్లనొప్పులతో బాధ పడేవారికి గ్రీన్ టీ చక్కని ఔషధంగా పనిచేస్తుంది. ప్రతి రోజు ఒక కప్పు గ్రీన్ టీ తాగటం వలన ఒత్తిడి నుండి ఉపశమనాన్ని పొందవచ్చు.
 
6. మనం ప్రతిరోజు గ్రీన్ టీ తాగటం వలన మన శరీరం రోగనిరోధకతను కలిగి ఉంటుంది.
 
10. జామ ఆకుల టీ
నీటిని మరిగించి, శుభ్రంగా కడిగిన జామ ఆకులను అందులో వేసి చల్లారిస్తే, జామాకుల టీ తయారవుతుంది. దీంతో ఎన్నో రకాల ఫలితాలను పొందొచ్చు. ఈ టీ తాగడం వల్ల రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు అదుపులో ఉంటాయి. దీనిలోని పోషకాలకు బరువు తగ్గించే గుణం కూడా ఉంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరిగి బాధపడేవారు ఈ టీని నెలకోసారి తాగినా ఫలితం కనిపిస్తుంది. అజీర్ణ సమస్యలూ తగ్గుతాయి.
 
జామాకు టీని తాగితే శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి. జలుబూ, దగ్గూ నెమ్మదిస్తాయి. శుభ్రంగా కడిగిన జామాకులను నమలడం వల్ల పంటి నొప్పులు దూరమవుతాయి. చిగుళ్ల నొప్పీ, నోటిపూతా తగ్గుతాయి.