గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 16 ఆగస్టు 2019 (19:46 IST)

స్త్రీ, పురుషులకు నిమ్మరసాన్ని ఇచ్చి చూస్తే...?

పనిలో ఒత్తిడి గురవుతున్నారా? అయితే వేడి వేడి టీలో రెండు స్పూన్ల చక్కెర వేసుకు తాగండి. మీ ఒత్తిడి మాయం. చక్కెరకు, ఒత్తిడికి ఏమిటి సంబంధం అనుకుంటున్నారా? అవునండీ! తీపి ద్రవాలు తీసుకున్న వారు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
 
చక్కెర మెదడుకు కావలసిన శక్తిని అందించి ప్రేరేపిస్తుంది. ఫలితంగా ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. న్యూ సౌత్ వేల్స్, క్వీన్స్‌ల్యాండ్ విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకులు చెప్పిన దాని ప్రకారం మెదడుకు శక్తిని ఇవ్వడానికి చక్కెర లేదా గ్లూకోజ్ అవసరమని తెలిపారు. 
 
ఈ పరిశోధనలో స్త్రీ, పురుషుల సమూహానికి నిమ్మరసాన్ని ఇచ్చారు. ఇందులో కొన్ని చక్కెర కలిపినవి కాగా.. మరికొన్ని కృత్రిమంగా తీపి చేయబడినవి. తర్వాత వీరందరికి ఒత్తిడితో కూడిన ఓ పాఠాన్ని తయారు చేయమని ఇవ్వగా.. అందులో కొందరు సదరు పని నిరుత్సాహకరంగా ఉందని మధ్యలోనే వదలి వేశారు. ఇలా చేసినవారంతా కృత్రిమంగా తీపి చేసిన పానీయాన్ని తాగినవారు కావడం గమనార్హం.
 
చక్కెరలో గ్లూకోజ్ అనే పదార్థం ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఆటల్లో అలసిపోయిన వారికి, బాగా నీరసంగా ఉన్న వారికి గ్లూకోజ్ కలిపిన నీళ్లు ఇస్తుండటాన్ని మనం చూస్తూనే ఉంటాం. ఇలా చేయడం ద్వారా గ్లూకోజ్‌ నేరుగా మెదడుకు చేరి ప్రేరణ కలిగించి శరీరాన్ని ఉత్తేజ పరుస్తుంది. తద్వారా శరీరంలోని అలసట పోయి ఉపశమనం కలుగుతుంది. మరింకెందుకు ఆలస్యం పంచదారతో పారద్రోలండి మీ ఒత్తిడిని.