సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : బుధవారం, 3 ఏప్రియల్ 2019 (13:40 IST)

విటమిన్ డి లోపం లేకుండా చూసుకోవాలంటే.. చేపలు తినాలట...

మానవ శరీరానికి విటమిన్ డి చేసే మేలు ఎంతో ఉందని చెప్పాలి. ఇది ఎముకలు ఆరోగ్యంగా ఉంచడంలో సహకరిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. డి విటమిన్ లోపిస్తే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీని లోపం దీర్ఘకాలం ఉంటే ఎముకలు వంకర తిరుగుతాయి. 
 
ఇది తగ్గితే ఆకలి అంతగా లేకపోవటం, బరువు తగ్గుదల, నిద్ర సరిగా పట్టక పోవటం, వంట్లో నీరసం వంటి సమస్యలు తరచూ కనిపిస్తాయి. తాజా అధ్యయనాలలో దీని లోపం వలన తీవ్ర తలనొప్పి కూడా వస్తుందని తేలింది. వ్యక్తులు అంతగా బయటి వారితో కలసి తిరగకపోవటం, శరీరానికి ఎండా సరిగ్గా సోకక పోవటం దీనికి కారణం. అయితే నిజానికి డి విటమిన్ ఆహరం ద్వారా చాల తక్కువగా అందుతుంది. 
 
మన చర్మానికి ఎండ వేడి తగిలినప్పుడు దిన్ని మన శరీరమే తయారు చేసుకుంటుంది. కనుక రోజూ చర్మానికి కాసంత సేపు అయినా ఎండ తగిలేట్టు చూసుకోవటం చాల అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు. సూర్యకాంతిలో ఉండే అల్ట్రావయొలెట్ బి కిరణాలు చర్మంపై పడినప్పుడు చర్మం కింద ఉండే పలు పదార్థాలు విటమిన్ డిని తయారు చేసుకుంటాయి.
 
 అనంతరం లివర్, కిడ్నీల్లో విటమిన్ డి హైడ్రాక్సిలేషన్ ప్రక్రియకు గురవుతుంది. అనంతరం దాన్ని శరీరం ఉపయోగించుకుంటుంది. అలా సూర్యరశ్మి ద్వారా తయారైన విటమిన్ డి మన శరీరంలోని రక్తంలో ఉండే కాల్షియంకు తోడై ఎముకలకు బలాన్ని చేకూరుస్తుంది. విటమిన్ డి మనకు సూర్యకాంతి వల్లే కాదు, పలు ఆహార పదార్థాలను తినడం వల్ల కూడా లభిస్తుంది. 
 
చేపలు, లివర్, చీజ్, కోడిగుడ్లు, కాడ్ లివర్ ఆయిల్, పాలు, పుట్టగొడుగులు తదితర ఆహారాలను తింటే విటమిన్ డి లభిస్తుంది. అయితే విటమిన్ డి లోపిస్తే మాత్రం పలు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. విటమిన్ డి లోపం వల్ల తీవ్రమైన అలసట, బలహీనత, ఎముకల్లో నొప్పి, బలహీనమైన కండరాలు, ఆలోచనా శక్తి తగ్గిపోవడం, తరచుగా ఎముకలు విరగడం, పగుళ్లు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీంతోపాటు శరీర నిరోధక శక్తి తగ్గుతుంది. 
 
పిల్లల్లో రికెట్స్, పెద్దల్లో కీళ్ల వ్యాధులు వస్తాయి. ఇన్సులిన్‌పై ప్రభావం పడుతుంది. దీంతో రక్తంలో ఉన్న గ్లూకోజ్ త్వరగా ఖర్చు కాదు. డయాబెటిస్ వస్తుంది. కనుక ఈ అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే విటమిన్ డి మనకు అందడం చాలా ముఖ్యం.