శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 20 అక్టోబరు 2020 (19:51 IST)

50 దాటేశారా..? ఐతే కాస్త చూసుకుని తినాలి, ఏం తినాలి?

వయసు పెరిగేకొద్దీ శరీరంలో ఆయా అవయవాల పనితీరు కూడా కాస్త నెమ్మదిస్తుంది. ముఖ్యంగా జీర్ణవ్యవస్థ. ఈ వ్యవస్థకు మరీ జీర్ణంకానటువంటి పదార్థాలను తీసుకుంటే సమస్య జఠిలమవుతుంది. అలాగే వయసు పెరిగి వృద్ధాప్యంలో పడుతున్న సమయంలో శరీరానికి శక్తి కూడా కావాలి. కాబట్టి తగిన పదార్థాలను ఆహారంలో భాగంగా చేసుకోవాలి.
 
వృద్ధుల్లో విటమిన్‌ డి, క్యాల్షియం, విటమిన్‌ బీ12, పీచు, పొటాషియం వంటి ప్రత్యేకమైన పోషకాల అవసరం చాలా ఎక్కువ. తక్కువ కొవ్వు పాల పదార్థాలు, ఆకు కూరలు, చేపలు తగినంతగా తీసుకోవటం ద్వారా విటమిన్‌ డి, క్యాల్షియం లభిస్తుంది. ఇవి ఎముక పుష్టికి దోహదం చేస్తాయి.
 
చేపలు, సముద్ర ఆహారం, తేలికైన మాసం నుంచి విటమిన్‌ బీ 12 అందుతుంది. సాధారణంగా వృద్ధాప్యంలో తప్పనిసరిగా వేధించే సమస్య మలబద్ధకం. రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, ముడి బియ్యం లేదా దంపుడు బియ్యం వంటి పొట్టు తీయని ధాన్యం అధికంగా తీసుకుంటే ఈ బాధ నుంచి తేలికగా బయటపడొచ్చు. వీటన్నింటిలో పీచు సమృద్ధిగా ఉంటుంది.
 
పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు పాల పదార్థాల్లో వృద్ధులకు అవసరమైన పొటాషియం కూడా ఉంటుంది. అందరిలాగే వృద్ధులు కూడా నూనె పదార్ధాలు, వేపుళ్లు తగ్గించటం శ్రేయస్కరం. ముఖ్యంగా నెయ్యి, డాల్డా వంటి సంతృప్త కొవ్వులు తగ్గించి పొద్దుతిరుగుడు నూనె వంటివి, అదీ మితంగా తీసుకుంటే మంచిది.