శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఎం
Last Updated : గురువారం, 15 జులై 2021 (11:59 IST)

కళ్లకు దృష్టిలోపం ఎందుకు వస్తుంది?

సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. మనకు కలిగే సర్వ పరిజ్ఞానానికి ప్రధాన అవయవాలు కళ్లు. కన్ను సంక్లిష్టమైన నిర్మాణం. అందులో భాగాలు ప్రధానమైనవి.

ఒకటి కంటిపాప (pupil). ఇందులో నుంచే కాంతి కంటి లోపలికి చేరుకుంటుంది. రెండోది కంటి కటకం (eye lens). ఇది పారదర్శక కండర నిర్మాణం. కంటిపాప నుంచి లోనికి వచ్చే కాంతిని సంపుటీకరించే శంఖాకార కటక లక్షణం దానికి ఉంది.

ఇక మూడోది నేత్ర పటలం లేదా రెటీనా. మనం చూసే వస్తువుల నిజమైన బింబాలు (true images) ఈ తెరలాంటి నిర్మాణం మీద తలకిందులుగా పడేలా కంటి కటకం కాంతిని కేంద్రీకరిస్తుంది. కంటికి సైటు... కంటిపాపలో సమస్యల వల్ల రావడం చాలా అరుదు.

సాధారణంగా కంటికి సైటు కంటి కటకపు వ్యాకోచ సంచోచాలు సక్రమంగా లేనపుడు వస్తుంది. లేదా ఆ కటక పారదర్శకత లోపించడం వల్ల వస్తుంది. ఈ పరిస్థితిని తెల్లగుడ్డు (cateract)అంటారు. రెటీనాలో కాంతిని గ్రహించే జ్ఞాన కణాలు ఉంటాయి.

సూర్యుడి కాంతిని, ఇతర ప్రకాశవంతమైన కాంతిని ఎక్కువ సేపు చూడ్డం వల్ల గానీ ఎ-విటమిన్‌ లోపం వల్ల గానీ రెటినా పొర సరిగా పనిచేయకపోతే సైటు శాశ్వతంగా వస్తుంది.

దీనికి చికిత్స దాదాపు కష్టం. కానీ కటకపు సంకోచ వ్యాకోచాలు సరిగాలేనపుడు వస్తువుల బొమ్మ రెటీనా కన్నా ముందే (హ్రస్వదృష్టి) లేదా అవతలో (దూరదృష్టి) పడుతుంది.

కళ్లద్దాలు వాడి ఈ సమస్య నుంచి బయటపడతారు. తెల్లగుడ్డు సమస్య వస్తే ఆపరేషన్‌ చేసి నయం చేయగలరు. కంటికలక వచ్చినపుడు కూడా దృష్టి మాంద్యం కలుగుతుంది.