గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 7 డిశెంబరు 2019 (21:17 IST)

ఈ చుండ్రు ఎక్కడి నుంచి వచ్చిందో కానీ అందరి తలలకు పట్టేసింది, వదిలించుకునేదెట్టా?

ఇపుడు తలలో చుండ్రు లేనివారు లేరంటే అతిశయోక్తి కాదు. ఈ చుండ్రు ఇదివరకు ఎవ్వరికీ వుండేది కాదు. కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో కానీ అందరి తలలకు పట్టేసింది. దీనితో దీన్ని వదిలించుకునేందుకు మార్కెట్లో టన్నులకొద్దీ షాంపూలు రంగంలోకి వచ్చేశాయి. ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. ఇలా చుండ్రును వదిలించుకునేందుకు డబ్బులు వదిలించుకునేకంటే ఈ క్రింది చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
 
మెంతులను పెరుగుతో నూరి తలకు పట్టిస్తే చుండ్రు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే గసగసాలను పాలతో నూరి.. తలకు లేపనం వేస్తే చుండ్రు తగ్గుతుంది. వేపనూనె, కానుగనూనె సమంగా కలిపి అందులో కొంచెం కర్పూరం వేసి రాస్తే చుండ్రు చాలా వేగంగా తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. మందార పూల రసానికి సమంగా నువ్వుల నూనె చేర్చి, నూనె మాత్రమే మిగిలేంత వరకు కాచాలి. ఆ నూనెను తలకు పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది.
 
నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ చుండ్రుపై సమర్థవంతంగా పనిచేస్తుంది. దీర్ఘకాలికంగా ఉన్న చుండ్రు సమస్యను తగ్గించుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల కొబ్బరినూనెను తీసుకుని వేడిచేయాలి. దానికి అంతే పరిమాణంలో నిమ్మరసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి. జుట్టు అంతటా విస్తరించేలా, కుదుళ్లకు తగిలేలా సున్నితంగా మసాజ్ చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత స్నానం చేస్తే సరిపోతుంది. 
 
వేపాకులో బ్యాక్టీరియాలకు వ్యతిరేకంగా పోరాడే యాంటీ సెప్టిక్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి వెంట్రుకలను సంరక్షించడంలో బాగా పనిచేస్తాయి. కొద్దిగా వేపాకు తీసుకుని దాన్ని మెత్తగా నూరి రసం తీయాలి. ఆ రసాన్ని తలకు పట్టించి పది నిమిషాల తర్వాత కడిగేస్తే చుండ్రు నుంచి ఉపశమనం లభిస్తుంది.