శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Updated : సోమవారం, 5 అక్టోబరు 2015 (18:32 IST)

అపచారం... అపచారం...! తిరుమలకు గుడ్లు, మాంసం.. ఇదెక్కడి చోద్యం

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువున్న తిరుమలకు అక్రమంగా మాంసం, గుడ్లు తీసుకెళుతూనే ఉన్నారు. తిరుమలలో మాంసం, మద్యం నిషేధంలో ఉన్నాయి. అయినా ఏదోక దారిని తిరుమలకు మాంసం మద్యం చేరుతూనే ఉన్నాయి. గుట్కా, ధూమపానం వంటి వాటిని కూడా నిషేధించారు. అయినా దమ్ముకొట్టే వారు తిరుమలలో అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నారు. 
 
ఆమద్య కాలంలో పెద్దఎత్తున కోడి మాంసం, కోడిగడ్లు అక్కడకు చేరుతుండేవి. బాలజీకాలనీతో నిర్మాణ ప్రదేశాలలో వీటిని వినియోగించేవారు. అక్కడున్న కూలీలు, బాలాజీ కాలనీ వాసులు తినేవారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలను కఠినతరం చేసి తనిఖీలు ముమ్మరం చేయడంతో వాటిని తిరుమలకు తీసుకెళ్ళడం కష్టసాధ్యంగా ఉండేది. ఈమధ్య మళ్ళీ మెల్లమెల్లగా తిరుమలకు మాంసం, గుడ్లను తీసుకెళ్ళడం మొదలుపెట్టారు. 
 
ఆదివారం ఉదయం 10.30 గంటలకు అలిపిరి తనిఖీ కేంద్రంలో 180 గుడ్లు, కిలో మాంసం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి జీవకోనకు చెందిన ఎస్‌.వరలక్ష్మి తిరుమలలో దారాలు విక్రయిస్తూ జీవనం గడుపుతున్నారు. ఈ క్రమంలో గుడ్లు తిరుమలలో విక్రయించేందుకు తీసుకెళుతుండగా పట్టుబడ్డారు.
 
సాధారణంగా ఆర్టీసీ బస్సులోనే వీటిని తీసుకెళ్ళుతున్నారు. ఎవరికీ అనుమానం కలుగకుండా బ్యాగుల్లో తరలిస్తుంటారు. పైన, కింద దుస్తులు పెట్టి మధ్యలో గుడ్లు ఉంచారు. సాధారణంగా బ్యాగులను తనిఖీ చేసే మిషన్‌ వద్దకు వెళ్లి చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. 
 
అయితే గుడ్లు ఉన్న బ్యాగును బస్సులో సీటు కింద పెట్టి వెళ్తారు. సిబ్బంది ఏమరపాటుతో వ్యవహరిస్తే అవి తిరుమలకు చేరుకుంటాయి. ఆదివారం కూడా ఇదే జరిగింది. మాంసం, గుడ్లను తీసుకెళ్ళుతున్న వరలక్ష్మిని అదుపులోకి తీసుకుని తిరుమల రెండో పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. మద్యం, మాంసం, గుడ్ల అమ్మకాలపై తిరుమల పోలీసులు మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది.