శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pyr
Last Updated : శుక్రవారం, 11 సెప్టెంబరు 2015 (17:15 IST)

లడ్డూలకు కొరత లేదు... దర్శనానికి ఇబ్బంది ఉండదు... మీట్ ద ప్రెస్‌లో టీటీడీ ఈవో సాంబశివరావు

తిరుమలలో లడ్డూలకు కొరలేదనీ, దర్శనానికి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పనిలేని విధంగా పరిస్థితులను మెరుగు పరిచామని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి. సాంబశివరావు తెలిపారు. ఇప్పటికే మూడు లైన్ల విధానంలో ఎటువంటి తోపులాటలు లేకుండా ప్రశాంతమైన దర్శనాన్ని కలిగిస్తున్నామని చెప్పారు. శుక్రవారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్‌లో జరిగిన మీట్ ద ప్రెస్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దర్శన విధానంలో మార్పులు తీసుకురావడం వలన చాలా సమయం కలసి వచ్చిందని తెలిపారు. ఫలితంగా భక్తులు వేచి ఉండాల్సిన సమయంలో పది గంటలు తగ్గిపోయాయని చెప్పారు. అత్యధికంగా 90 వేల మంది దర్శనం చేసుకోగలుగుతున్నారని చెప్పారు. ఇక లడ్డూల విషయానికి వస్తే నడక దారిన వచ్చే వారు ఒక్కొక్కరు అదనపు లడ్డూలతో కలపి 4 నుంచి 5 లడ్డూలు తీసుకెళ్ళ గలుగుతున్నారని చెప్పారు. కుటుంబం దర్శనానికి వచ్చిందనుకుంటే సగటున 16 నుంచి 20 లడ్డూలు తీసుకెళ్ళ గలుగుతున్నారని చెప్పారు. నడకదారిన వచ్చే వచ్చేవారు అత్యధిక లడ్డూలను తీసుకెళ్ళుతున్నారని చెప్పారు. బ్రహ్మోత్సవాలలో ఎటువంటి కొరత లేకుండా ఉండడానికి కనీసం ఆరు లక్షల లడ్డూలను నిల్వ ఉంచగలుగుతున్నామని అన్నారు. 
 
వసతి కూడా భారీ ఎత్తునే చేస్తున్నామని చెప్పారు. గత నెలలో 109 శాతం మంది గదులను పొందగలిగారని దీనిని త్వరలో 125 శాతానికి పెంచుతామని చెప్పారు. వెంటవెంటనే గదులను కేటాయించడం వలన ఇది సాధ్యమయ్యిందని చెప్పారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు. 
 
ప్రశ్న : తిరుమలలో చాలా కాలంగా పని చేస్తున్న వారినే ఉండడంలో అర్థం ఏమిటి? 
ఈవో : ఇక్కడ మూడేళ్ళకొకసారి బదిలీ చేయాలనే నిబంధనను పరిగణలోకి తీసుకుంటే బాగా పని చేసేవారికి బాగా పని చేయని వారికి తేడా లేకుండా పోతుంది. బాగా పని చేసే వారిని తప్పకుండా ప్రోత్సహించాలి. వారి ద్వారా మరిన్ని సేవలు పొందాలి. అలాగని మూడేళ్ళకు మడికట్టుకు కూర్చుంటే కష్టం అందుకే ప్రత్యేక పరిస్థితులలో కొందరిని అలాగే ఉంచాల్సి వస్తోంది. అలాగని పారదర్శకత లోపించకుండా చూసుకుంటాం. 
 
ప్రశ్న : బ్రహ్మోత్సవాలకు వారం ముందు ఇంజనీరింగ్ విభాగం పనులు చేపడుతోంది. దీని నాణ్యతకు లోపం లేదా..? 
ఈవో : ఏమండోయ్... టీటీడీ నాణ్యత విషయం రాజీ పడదు. పడే ప్రశ్నేలేదు. పారదర్శకంగా నాణ్యతలో లోపం లేకుండా పనులు చేయిస్తాం. ఒక వేళ నాణ్యత లోపించినట్లు తెలిస్తే ఎవరినీ ఉపేక్షించే ప్రశ్నే లేదు. మీరు అన్న విషయంలో మరో మారు క్రాస్ చెక్ చేసుకుంటాం. 
 
ప్రశ్న : లడ్డూల విషయంలో టీటీడీ పక్షపాతంగా వ్యవహరిస్తున్నట్లు అనిపించడం లేదా.. ఉద్యోగులకు ఉచిత, రాయితీ లడ్డూలను ఇస్తున్నారు. మరి లడ్డూ ధరనేమో పెంచాలనుకుంటున్నారు.. ఇది భక్తులపై భారం కాదా..?
ఈవో : లడ్డూ విషయంలో ఇప్పటికే అప్రమత్తంగా ఉన్నాం. లడ్డూలో నాణ్యత విషయంలో వెంటనే యాక్షన్ తీసుకుంటున్నాం. తగినన్ని లడ్డూలను అందుబాటులోకి తెస్తున్నాం. తయారీ కంటే తక్కువ ధరకే ఇస్తున్నామంటున్నారు. అయినా సరే లడ్డూ ధర పెంచాలా లేదా అనే అంశంపై టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంటుంది. సమావేశంలో చర్చించిన మీద నిర్ణయం జరుగుతుంది.
 
ప్రశ్న : టీటీడీకి డిమాట్ అకౌంట్ ఎందుకు? ఏమి ఆదాయం వస్తోంది.? 
ఈవో : తిరుమల శ్రీవారికి రకరకాల కానుకలు వస్తుంటాయి. ఆస్తులు, బంగారం.. నగదు ఇలా అనే రూపాలలో వస్తుంటుంది. ఈ మధ్యలో షేర్ల రూపంలో కూడా కానుకలు వచ్చాయి. ఆ షేర్లు టీటీడీ అకౌంట్లోకి రావాలంటే ఖచ్చితంగా డిమాట్ అకౌంట్ అవసరం అందుకే ఖాతా తెరవాల్సి వచ్చింది. మంచి రెస్పాన్స్ ఉంది. 
 
ప్రశ్న : రాయలసీమ ప్రాంతం వెనుకబడి ఉంది. టీటీడీ ఉద్యోగాలలో స్థానిక కోటా ఏమైనా ఉంటుందా..?
ఈవో : ఇది పూర్తిగా పాలసీ మేటర్. దీనిపై బోర్డు నిర్ణయం తీసుకోవాలి. కొన్నిఅంశాలను ప్రభుత్వం అడిగింది. పంపాము. వాటికి సంబంధించి అనుమానాలను కూడా అడిగింది. మళ్ళి పంపాం. ప్రభుత్వం ఏమి చెబుతుందో చూసి బోర్డులో నిర్ణయం తీసుకోవాలి. 
 
ప్రశ్న : వరుణ యాగం చేసేందుకు సమయం సందర్భం ఏమి ఉండదా..? దీనిపై వస్తున్న విమర్శలకు మీ సమాధానం ? 
ఈవో : ఖచ్చితంగా ఉంటుంది. వరుణ యాగాన్ని పండితుల సలహా మేరకే తీసుకుంటాం. అందులో అనుమానం లేదు. అయితే అందులోనూ వ్యతిరేకించే వారు ఉంటారు. వారు చెబుతుంటారు. టీటీడీ ఇలాంటి వాటికి ప్రామాణికంగా ఉండాలి. ఆగమ శాస్త్రం ప్రకారమే నడుచుకుంటాం. 
 
ప్రశ్న : సమాచార హక్కు చట్టం కింద సమాచారం ఇవ్వడానికేమిటి? 
ఈవో : సమాచారం తీసుకోవడానికి సమాచార హక్కు చట్టమే అవసరం లేదు. సామాన్యులు కూడా తీసుకోవచ్చు ఏ సమాచారం ఇవ్వగలమో అది మాత్రమే ఇస్తాం. ఇందులో ఇబ్బంది లేదు. 
 
ప్రశ్న: తిరుపతిని స్మార్టు సిటీగా చేస్తామంటున్నారు.. ఇక్కడి తాగునీటి సమస్యనే తీర్చేలేకున్నారే..? 
ఈవో : యస్... తిరుమల తిరుపతిలోని కొన్ని అంశాలకు సంబంధించి టీటీడీ చూసుకుంటోంది. నీరు మరింత కావాలంటే పైపులైన్లను మెరుగు పరచాలన్నారు. అందుకోసం రూ. 16 కోట్లు ఇచ్చాం. ఇప్పటికే 3,4 ప్రాంతాలకు తాగునీటిని టీటీడీ అందిస్తోంది. ఎమ్మార్ పల్లె వంటి ప్రాంతాలకు అవసరమన్నారు. మరో రూ. 10 కోట్లు ఇచ్చాం. స్విమ్స్, బర్డ్ వంటి ప్రాంతాలకు ఇస్తున్నాం. ఇంకా కావాలంటే మరో రూ. 12 కోట్ల నిధులు ఇచ్చాం. 
 
ప్రశ్న : టీటీడీలో పెట్టే భోజనం సరిగా అరగడం లేదని వాదన ఉంది. దీనిపై మీ కామెంట్ 
ఈవో : మేము ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ ఉంటాం మాకు ఉన్న సమాచారం మేరకు బాగుందనే చెబుతున్నారు. అయితే సైంటిఫిక్‌గా కూడా కొంత అధ్యయనం చేయించాలనుకుంటున్నాం. అవసరమనుకుంటే మార్పులు తీసుకువస్తాం.