భారీ స్కానర్ల కొనుగోలుకు సిద్ధమవుతున్న టీటీడీ...

pyr| Last Updated: శనివారం, 12 సెప్టెంబరు 2015 (08:31 IST)
తిరుమల వెళ్ళే ప్రయాణీకులతో తిరుపతి సమీపంలోని అలిపిరి ఎప్పుడూ రద్దీగా కనిపిస్తుంది. ఇక శుక్రవారం నుంచి ఆదివారం వరకూ ఈ రద్దీ మరింత ఎక్కువ ఉంటుంది. అన్ని వాహనాలను తనిఖీ చేసి పంపాలంటే సిబ్బంది తలప్రాణం తోకకు వస్తోంది. గంటల సమయం పడుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త స్కానర్లను కొనుగోలు చేయడానికి సిద్ధమవుతోంది. ఇందుకోసం ప్రయోగాత్మకంగా మొదట పరిశీలన జరపుతారు.

తిరుమలకు వచ్చే భక్తులతో తిరుపతి కిటకిటలాడుతుంటుంది. వీరంత ఉదయమే బస్సులు, రైళ్ళు దిగి తిరుమల వెళ్ళడానికి అలిపిరి చేరుకుంటారు. అక్కడ తనిఖీలు పూర్తయిన తరువాత తిరుమల వెళ్ళాల్సి ఉంటుంది. రోజుకు ఇంచుమించు 6 వేల వాహనాలు తిరుమలకు వెళ్ళుతున్నాయి. ఒక్కో వాహనం తనిఖీకి కనీసం 4 నిమిషాల సమయం పడుతుంది. బస్సుల తనిఖీకి అయితే మరింత ఎక్కువ సమయం పడుతోంది. దీంతో ఉదయం వాహనాలు పెద్ద ఎత్తున అక్కడే నిలచిపోతున్నాయి. తనిఖీల ప్రక్రియ పూర్తి చేసుకుని కొండకు ప్రయాణం కావడానికి భక్తులు గంటల కొద్ది వేచి ఉండాల్సిన స్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో భారీ స్కానర్లను కొనుగోలు చేయాలని టీటీడీ నిర్ణయించింది.

ఇందుకోసం కస్టమ్స్ అధికారులు వినియోగించే స్కానర్లను తెప్పించాలని యోచిస్తున్నారు. అయితే వాటి నుంచి ఉద్గారమయ్యే రేడియేషన్ వలన కలిగే ప్రమాదాన్ని లెక్కిస్తున్నారు. భారీ స్కానర్ల వలన రేడియేషన్ ప్రమాద స్థాయిలో లేదని ఇప్పటికే ఓ ప్రాథమిక అంచనాకు వచ్చారు. పైగా ఈ స్కానర్ల ద్వారా కేవలం 5 సెకన్లలోనే మొత్తం బస్సును, అందులో ఉండే ప్రయాణికులను స్కాన్‌ చేసే సామర్థ్యం ఉంటుంది. దీని వలన బోలెడు సమయం కలసి వస్తుందని భావిస్తున్నారు. అయితే వీటిని కొనుగోలు చేయబోయే ముందు ప్రయోగాత్మకంగా పరిశీలించనున్నారు. ఇక్కడ ఫలితాలను అనుసరించి కొనుగోళ్ళు జరపాలని నిర్ణయించారు.
దీనిపై మరింత చదవండి :