క్యూలైన్లు మొదలుకుని.. టీటీడీ సేవలు భేష్
నిత్యం కొన్ని వేల మంది వచ్చే భక్తులను ఓ క్రమంలో దర్శనానికి పంపించేందుకు టిటిడి అవలంభిస్తున్న విధానం ప్రశంసనీయమని జాతీయ డిఫెన్స్ కళాశాల కమిటీ ప్రశంసించింది. తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్న సేవలను, ధార్మిక కార్యక్రమాలను వారు అభినందించారు. భారత త్రివిధ దళాలైన ఆర్మీ, నేవి, ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సీనియర్ ఐపిఎస్ అధికారులతో కూడిన ఈ కమిటీ మంగళవారం స్థానిక పద్మావతి అతిధిగృహంలో టిటిడి జెఇఓ, తిరుమల ఇన్‌చార్జ్ జెఇఓగా వ్యవహరిస్తున్న పోలా భాస్కర్‌తో సమావేశమైంది.
ప్రపంచం నలుమూలల నుంచి వస్తున్న భక్తులకు అందిస్తున్న శ్రీవారి దర్శనం, బస, ప్రసాదం తదితర సేవలు, కల్యాణకట్ట, నిత్యాన్నప్రసాదం, శ్రీవారి సేవ తదితర విభాగాల గురించి పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా జెఇఓ తెలియజేశారు. టిటిడి నిర్వహిస్తున్న ఎనిమిదిట్రస్టులు, ఒక స్కీమ్ ను, కుష్ఠు వ్యాధి గ్రస్తులు, పేదలు, అనాథల కోసం ప్రత్యేక కేంద్రాలు, వికలాంగులు, బధిర బాలబాలికల కోసం పాఠశాల గురించి కమిటీకి వివరించారు.
కమిటీ సభ్యులు మాట్లాడుతూ టిటిడి కార్యక్రమాలతోపాటు పెద్ద సంఖ్యలో విచ్చేస్తున్న భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు అవలంబిస్తున్న క్యూలైన్ పద్దతులను అభినందించారు. ఓ ధార్మిక సంస్థ ఇంత చక్కటి క్రమశిక్షణతో ఇన్ని సేవలను నిర్వహించడం నిజంగా ఆశ్చర్యం కలుగుతుందని కమిటీ తెలిపింది. ఈకార్యక్రమంలో టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్ ప్రత్యేక అధికారి శ్రీరాం రఘునాథ్, సేవల విభాగం ఉప కార్యనిర్వహణాధికారి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.