గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 4 అక్టోబరు 2021 (22:40 IST)

పులిపిర్లను పారద్రోలే వైద్యం, ఏంటో తెలుసా?

వెల్లుల్లి రేకలను పులిపిరులపైన రుద్దాలి. వెల్లుల్లిలోని యాంటీ వైరల్ గుణంవల్ల పులిపిరులు తగ్గుతాయి. ఇలా కనీసం రెండు మూడు వారాలపాటు చేయాలి. ఉల్లిపాయను సగానికి కోసి మధ్యభాగాన్ని చెంచాతో తొలగించి సముద్రపు ఉప్పుతో నింపాలి. కొంతసేపటికి ఉప్పు, ఉల్లిరసం కలిసిపోయి ఒక ద్రవ పదార్థంగా తయారవుతుంది. దీనిని తీసి జాగ్రత్త చేసుకుని 30 రోజులపాటు పులిపిరులపైన ప్రయోగిస్తుంటే గుణం కనిపిస్తుంది. 
 
పులిపిరులకు ఔషధంగా ఆముదం చక్కగా పనిచేస్తుంది. ఒక చుక్క ఆముదాన్ని పులిపిరి పైన వేసి స్టికింగ్ టేప్ అతికించాలి. ఇలా రెండు పూటలా మూడు వారాలు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. ఉత్తరేణి మొక్కను కాల్చగా వచ్చిన బూడిదను తులసి ఆకులతోగానీ లేదా మణిశిల అనే ఆయుర్వేద ఖనిజ పదార్థంతో గానీ కలిపి నూరి ఆవనూనె చేర్చి పులిపిరులపైన ప్రయోగించాలి.
 
కొత్త సున్నాన్ని పులిపిరులపైన ప్రయోగిస్తే రాలి పడిపోతాయి. అల్లం ముక్కను వాడిగా చెక్కి కొత్త సున్నంలో ముంచి పులిపిరికాయలపైన రాయాలి. అయితే ఇది చేసేటప్పుడు సున్నం చుట్టుప్రక్కల చర్మానికి తగలకుండా జాగ్రత్త పడాలి. సున్నం మామూలు చర్మానికి తగిలితే బొబ్బలు తయారవుతాయి.
 
పులిపిర్ల చికిత్సలో విటమిన్ల పాత్ర కూడా ముఖ్యమైనదే. విటమిన్-ఎ, విటమిన్-సిలను పైపూతగా ప్రయోగిస్తే పులిపిరికాయలు తగ్గే అవకాశం ఉంది. చేప నూనె, క్యారెట్ మొదలైన వాటిలో విటమిన్ -ఎకు సంబంధించిన అంశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఉసిరికాయలలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. వీటిని నలగ్గొట్టి గుజ్జుగా చేసి ఒకటి రెండు నెలలపాటు ప్రతిరోజూ పులిపిర్ల మీద పూతగా లేపనం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.