శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. భారతీయ
Written By సిహెచ్
Last Modified: శనివారం, 9 ఫిబ్రవరి 2019 (21:41 IST)

రేగిపండు పచ్చడి భలే టేస్ట్.. ఎలా చేయాలో తెలుసా?

ప్రతిఒక్కరు పచ్చడి అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లోనే రకరకాల రోటి పచ్చళ్లు చేసుకొని తింటూ ఉంటారు. అలా తయారుచేసుకునే పచ్చళ్లలో రేగిపచ్చడి ఒకటి. ఇది చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో మంచిది. దీనిని పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు రేగి పచ్చడి ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం.
 
కావలసిన పదార్ధాలు...
రేగిపండ్లు-పావుకిలో
పచ్చిమిర్చి-10
నూనె- 2 టేబుల్ స్పూన్లు
నువ్వులు- పావు టీ స్పూన్
ఎండుమిర్చి-2
మినపప్పు-ఒక టీ స్పూన్
కరివేపాకు- కొద్దిగా
తరిగిన కొత్తిమీర- 2 టీ స్పూన్లు
ఇంగువ- చిటికెడు
ఉప్పు-తగినంత
 
తయారీ విధానం...
ముందుగా రేగిపండ్లలో విత్తనాలను తీసేసి పెట్టుకోవాలి. కొద్దిగా నూనె వేసి పచ్చిమిర్చిని వేగించి, దించేసిన తర్వాత రేగి పండ్లు, ఉప్పువేసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత ఒక బాణలిలో నూనె పోసి వేడెక్కాక నువ్వులు, ఎండుమిర్చి, మినపప్పు, కరివేపాకు, కొత్తిమీర, ఇంగువ వేసి పోపు పెట్టుకొని దాన్ని రేగిపండ్ల పచ్చడిలో కలపాలి.