గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. భారతీయ
Written By సిహెచ్
Last Modified: శనివారం, 29 డిశెంబరు 2018 (15:52 IST)

అరికెలతో వడలు... ఎంతో రుచి, ఆరోగ్యం

మనం రకరకాల పిండి వంటలను తింటూ ఉంటాం. ఇవి మంచి రుచిని ఇస్తాయి. ఇవేకాకుండా చిరుధాన్యాలతో తయారుచేసుకునే వంటకాలు మంచి రుచితో పాటు, మనలను అనేక అనారోగ్య సమస్యల నుంచి  కాపాడతాయి. శరీరానికి మంచి పటుత్వాన్ని ఇవ్వడంలో చిరుధాన్యాలు ప్రధానపాత్ర వహిస్తాయి. ముఖ్యంగా అరికెలలో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి చిన్నపిల్లలకు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో పుష్కలంగా పీచుపదార్ధం ఉండటం వలన బరువు తగ్గడానికి ఇవి ఎంతగానో సహకరిస్తాయి. వీటితో పిల్లలకు ఇష్టమైన రకరకాల స్నాక్స్
తయారుచేసుకోవచ్చు. ఇప్పుడు అరిక వడలు ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం.
 
కావలసిన పదార్ధాలు... 
అరిక బియ్యం-250 గ్రాములు
శనగపప్పు-150 గ్రాములు
ఉల్లి తరుగు-అరకప్పు
పచ్చిమిర్చి-2 చెంచాలు
కరివేపాకు- 2 రెబ్బలు
జీలకర్ర -1 చెంచా, 
అల్లం తరుగు- 1 చెంచా, 
ధనియాలు-2చెంచాలు
ఉప్పు-తగినంత
నూనె- వడలు ఏపుకునేందుకు సరిపడా
 
తయారుచేసుకునే విధానం... అరికబియ్యం ,శనగపప్పు 3నుండి 4 గంటలు నానబెట్టుకోవాలి. ఈ నానిన అరికెలు, శనగపప్పుకు ధనియాలు, అల్లం చేర్చుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా రుబ్బుకోవాలి. రుబ్బుకున్న పిండిలో ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, జీలకర్ర ఉప్పు తగినంత కలుపుకొని మూకుడులో నూనె పోసుకొని వడలు కాల్చుకోవాలి.

ఈ వడలను పులిహోరలోను, సాయంత్రం టిఫిన్‌లా ఉపయోగించుకోవచ్చు. శనగపప్పు ఇష్టపడనివారు బొబ్బర్లు కానీ, పెసరపప్పు కానీ తీసుకోవాలి. అంతేకాదు వడ పిండిలో మెంతికూర గాని, ములగాకు కానీ, తోటకూర కానీ కలుపుకొని వడలు కాల్చుకోవచ్చు. వడ పిండిలో కొంచెం ఇంగువ కూడా కలుపుకోవచ్చు. ఒక్కొక్కసారి నానబెట్టటానికి సమయం లేకపోతే వేడినీళ్లు కాసి అందులో 2 గంటలు నానపెడితే సరిపోతుంది.