పొరపాటున భారత భూభాగంలోకి పాక్ బుడతడు.. స్వీట్లతో అప్పగింత

indo pak flag
ఠాగూర్| Last Updated: గురువారం, 8 ఏప్రియల్ 2021 (07:41 IST)
పాకిస్థాన్‌కు చెందిన ఓ బుడతడు పొరపాటును భారత భూభాగంలోకి ప్రవేశించాడు. ఆ కుర్రోడిని భారత బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఈ విషయాన్ని పాకిస్థాన్ బలగాలకు చేరవేశాయి. ఆ తర్వాత ఆ కుర్రోడిని తిరిగి పాకిస్థాన్ బలగాలకు అప్పగించింది. అదికూడా స్వీట్లిచ్చి మరీ అప్పగించింది. దీంతో భారత సైన్యం మరోమారు తన సహృదయతను చాటుకుంది.

ఈ వివరాలను పరిశీలిస్తే, పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)లోని లిపా ప్రాంతానికి చెందిన మోసిన్‌ అనే 13 ఏళ్ల అబ్బాయి పొరపాటున సోమవారం రాత్రి భారత భూభాగంలోకి వచ్చాడు. ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లా సాధ్‌పొర ప్రాంతంలోకి ప్రవేశించాడు.

ఈ కుర్రోడిని గమనించిన సైనికులు అదుపులోకి తీసుకొని విచారించారు. అనుకోకుండా ఇటువైపు వచ్చినట్లు ధ్రువీకరించుకున్నారు. విషయాన్ని పాక్ సైన్యానికి తెలియజేశారు. వారు స్పందించి తిరిగి ఇవ్వమని కోరే వరకు సరిహద్దుల్లో గస్తీ కాస్తున్న సైనికులు అతణ్ని తమ వద్దే ఉంచుకొని జాగ్రత్తగా చూసుకున్నారు.

తర్వాత ఇరు దేశాల సైన్యం మధ్య హాట్‌లైన్‌లో చర్చలు జరిగాయి. అబ్బాయి కుటుంబ సభ్యులతో వివరాలను ధ్రువీకరించుకున్న పాక్ ఆర్మీ అతణ్ని అప్పగించాలని కోరింది. మానవతా దృక్పథంతో వ్యవహరించిన భారత సైన్యం ఆ అబ్బాయిని తిత్వాల్‌ క్రాసింగ్‌ పాయింట్‌ వద్ద పాక్ సైన్యానికి అప్పగించింది. తిరిగిచ్చేటప్పుడు కొత్త బట్టలు, స్వీట్లు బహుమానంగా కూడా ఇవ్వడం గమనార్హం. తిత్వాల్‌ ఇరు దేశాల మధ్య శాంతికి చిహ్నంగా నిలుస్తోంది.దీనిపై మరింత చదవండి :