బిడ్డలతో కలిసి చెప్పాపెట్టకుండా పారిపోయిన దుబాయ్ రాజు భార్య
తన ఇద్దరు పిల్లలతో కలిసి ఎవరికీ చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయింది. ఆమె వెళుతూ వెళుతూ రూ.241 కోట్లతో పారిపోవడం ఇపుడు కలకలం రేపింది. ప్రస్తుతం ఆమె లండన్‌లో ఉన్నట్టు తేలింది. దీంతో ఎవరి కోసం నువ్వు లండన్ వెళ్లావ్ అంటూ దుబాయ్ రాజు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రశ్నించారు.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రధాని, దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ (69) భార్య, హయా అల్ హుస్సేన్ (45). ఈమెకు దుబాయ్ రాజు ఇటీవల విడాకులు ఇచ్చారు. దీంతో తనక ప్రాణాపాయం ఉంటుదని ఆందోళన చెందిన హయా... తన ఇద్దరు పిల్లలను తీసుకుని రాత్రికి రాత్రే లండన్‌కు వెళ్లిపోయింది.
ఈ ఘటనపై షేక్ మహమ్మద్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆమె మోసం చేసిందని ఆరోపించారు. 'ఎవరి కోసం నువ్వు లండన్ వెళ్లావ్?' అంటూ తన ఇన్‌స్టాగ్రమ్ ద్వారా మండిపడ్డారు. ఈ వ్యవహారంపై దుబాయ్ రాజు మండిపడుతున్నారు.
మరోవైపు, జర్మనీకి చెందిన ఓ దౌత్యవేత్త సాయంతో హయా లండన్‌కు వెళ్లినట్టు తెలుస్తోంది. తనకు జర్మనీలో ఆశ్రయం కల్పించాలని కూడా ఆమె కోరినట్టు సమాచారం. జోర్డన్ రాజుకు హయా సవతి సోదరి అవుతారు.
2004లో షేక్ మహమ్మద్ తో హయాకు వివాహం జరుగగా, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరోవైపు, ఈ వ్యవహారంపై అటు దుబాయ్ సర్కారు లేదా ఇటు బ్రిటన్ ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు.