చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అదృశ్యం
చైనా అధ్యక్షుడు జీ జిన్‍పింగ్ అదృశ్యమయ్యారు. గత మే నెల 21వ తేదీ నుంచి జూన్ 5వ తేదీ వరకు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే, ఆయన ఉన్నట్టుండి ఇలా కనిపించకుండా పోవడం సర్వసాధారణమేనని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, జీ జిన్‌పింగ్ ఉన్నట్టుండి కనిపించకుండా పోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. దాదాపు రెండు వారాల పాటు ఆయన ఎక్కడున్నారనే దానిపై స్పష్టత లేకపోవడంతో చైనాలో నాయకత్వం మార్పు తథ్యమనే ఊహాగానాలు ఉపందుకున్నాయి.
చైనా మీడియా కథనాల మేరకు.. మే 21వ తేదీ నుంచి జూన్ 5వ తేదీ వరకు జిన్‌పింగ్ ఏ ఒక్క అధికారిక కార్యక్రమంలో పాల్గొనలేదు. ఈ పరిణామంపై నిఘా వర్గాలు విశ్లేషణలు చేపట్టాయి. జిన్‌పింగ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించి ఆయన స్థానంలో సంస్కరణలకు మద్దతు తెలిపే టెక్నోక్రాట్ వాంగ్ యాంగ్‌ను కొత్త అధ్యక్షుడుగా నియమించవచ్చే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే, ఈ ఊహాగానాల్లో ఏమాత్రం నిజం లేదని మరికొన్ని నిఘా సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. షీ జిన్‌పింగ్ ఇలా మధ్యమధ్యలో కనిపించకుండా పోవడం సాధారణ విషయమని అవి పేర్కొన్నాయి.