1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 ఏప్రియల్ 2020 (09:43 IST)

కువైట్‌లోని భారతీయుల్లో వేగంగా వ్యాపిస్తున్న కరోనా.. కారణమిదే...

మన దేశ పౌరులు అనేక మంది ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లివున్నారు. వీరంతా ఇపుడు కరోనా వైరస్ కారణంగా అక్కడ కష్టాలుపడుతున్నారు. కరోనా దెబ్బకు అంతర్జాతీయ సరిహద్దులు మూసివేశారు. అంతర్జాతీయ రాకపోకలు కూడా నిలిపివేశారు. అదేసమయంలో అరేబియా దేశాల్లో కరోనా వైరస్ కూడా శరవేగంగా వ్యాపిస్తోంది. దీంతో ఆయా దేశాలు కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. 
 
ముఖ్యంగా, కువైట్‌లో కూడా అనేక మంది భారతీయులు ఈ వైరస్ సోకినట్టు సమాచారం. దీనికి కారణం.. వారు అత్యంత ఇరుకైన గదుల్లో నివసించడంతో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రి షేక్ అహ్మద్ నాసర్ అలా సభా చెప్పుకొచ్చారు. ఇదేవిషయాన్ని భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌కు ఫోన్ చేసి తెలిపారు. 
 
పైగా, పరిస్థితి విషమించకముందే వీలైనంత త్వరగా ప్రత్యేక విమానాలను అనుమతించాలని కోరారు. అదేసమయంలో కువైట్‌లోని భారతీయుల యోగక్షేమాలను మంత్రి జైశంకర్‌కు ఆయన వివరించారు. 
 
మహ్బులలో 540 మంది భారతీయులు నివసించే కార్మిక క్యాంపులో వ్యాధి సోకిన ఒకరిని క్వారంటైన్‌ చేసినట్టు చెప్పారు. ఆ తర్వాత మరికొందరిని పరీక్షించగా, వారిలో చాలా మందికి కరోనా పాజిటివ్ రావడంతో వారందరినీ రెండు ప్రత్యేక ఆసుపత్రులకు తరలించారు.