శనివారం, 22 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 నవంబరు 2025 (10:12 IST)

అమెరికాకు విదేశీ ఉద్యోగుల అవసరం ఎంతైనా ఉంది : డోనాల్డ్ ట్రంప్

Donald trump on H1B Visa
అమెరికాకు విదేశీ ఉద్యోగుల అవసరం ఎంతైనా ఉందని ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అభిప్రాయపడ్డారు. హెచ్-1బీ వీసా ఉద్యోగులను ఉద్దేశిస్తూ ఆయన తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశీ ఉద్యోగుల అవసరం అమెరికాకు ఎంతగానో ఉందన్నారు. 
 
అమెరికా - సౌదీ పెట్టుబడుల సదస్సులో ఆయన మాట్లాడుతూ, అమెరికాలో చాలా పెద్ద సంఖ్యలో ప్లాంట్లను నిర్మించనున్నట్లు తెలిపారు. ఇవి దేశ ఆర్థికవృద్ధికి దోహదపడతాయన్నారు. ఈ ప్లాంట్లలో పనిచేసేందుకు విదేశీ నైపుణ్యం కలిగిన వారిని తీసుకురావాల్సి ఉంటుందన్నారు. వారు అమెరికన్లకు కూడా ఆ నైపుణ్యాలను నేర్పించాలన్నారు.
 
అమెరికాలోని కంపెనీల్లో బిలియన్ డాలర్ల కొద్దీ పెట్టుబడులు పెట్టి స్థానిక నిరుద్యోగులను నియమించుకొని.. నిపుణులు లేకపోతే విజయం సాధించలేరని వ్యాఖ్యానించారు. విదేశీ ఉద్యోగులు అమెరికన్లకు నైపుణ్యాలు నేర్పించి తిరిగి స్వదేశాలకు వెళ్లొచ్చన్నారు. అరిజోనాలో బిలియన్ డాలర్లతో భారీ కంప్యూటర్ చిప్ ఫ్యాక్టరీ తెరిచి.. దాన్ని నడిపేందుకు నిరుద్యోగులను తీసుకుంటారని తాను భావిస్తున్నట్లు తెలిపారు. 
 
విదేశీ వృత్తి నిపుణులు వేలాది మందిని తమతో తీసుకురావాలని.. వారిని తాను స్వాగతిస్తానని ట్రంప్ చెప్పారు. అమెరికాలో అధిక నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగుల అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఇది మాగా సభ్యులకు అర్థం కాలేదంటూ అసహనం వ్యక్తంచేశారు. విదేశీ ఉద్యోగులను అనుమతించకపోతే తాము విజయం సాధించలేమని అంగీకరించారు.