పట్టపగలే సాయుధులు రెచ్చిపోయారు.. 37మంది బలి
పశ్చిమ నైజర్‌లోని టిల్లాబేరి ప్రాంతంలో ఉన్న బానిబంగోలో పట్టపగలే సాయుధులు రెచ్చిపోయారు. మరాణాయుధాలతో ఓ గ్రామంలోకి చొరబడి కాల్పుల మోత మోగించారు. చిన్నపిల్లలు, మహిళలని కూడా చూడకుండా.. విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. దుండగుల బీభత్సానికి 37 మంది బలయ్యారు. మృతుల్లో 17 ఏళ్ల లోపు చిన్నారులు 13 మంది ఉన్నారు. నలుగురు మహిళలు కూడా మరణించారు.
సోమవారం మధ్యాహ్నం తుపాకులతో కొందరు సాయుధులు గ్రామంలోకి చొరబడ్డారు. వస్తూ వస్తూనే కనిపించిన వారిందరిపైనా కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలతో అక్కడికక్కడే చాలా మంది నేలకొరిగారు. ఆస్పత్రికి తరలించే లోపే మరికొందరు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనపై యూనిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. అభం శుభం తెలియని అమాయక పిల్లలను చంపడం దారుణమని పేర్కొంది. మృతుల కుటుంబాకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపింది. ఇలాంటి ముష్కర మూకల అంతానికి అన్ని దేశాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.