మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 జనవరి 2020 (11:54 IST)

కమ్ముకున్న యుద్ధ మేఘాలు... భారత్ హెచ్చరిక...

ఇరాన్ - అమెరికా దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. దీంతో భారత్ అప్రమత్తమైంది. ఇరాన్, ఇరాక్ దేశాలతో పాటు గల్భ్ దేశాల గగనతలంలోకి వెళ్లొద్దని హెచ్చరిక చేసింది. పైగా, ఇరాన్, ఇరాక్ దేశాల్లో పర్యటించదలచుకున్న దేశ పౌరులంతా తమ పర్యటనలను రద్దు చేసుకోవాలని సూచన చేసింది. ఇరాన్, ఇరాక్‌లో పరిస్థితుల దృష్ట్యా ఇరాక్‌ ప్రయాణానికి దూరంగా ఉండాలని పేర్కొంది. ముఖ్యంగా, ఇరాక్‌లో ఉన్న భారతీయులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరింది.
 
అదేసమయంలో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇరాక్‌లో నివసిస్తున్న భారతీయ పౌరులు స్థానికంగా ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించింది. ప్రయాణాలన్నీ వాయిదా వేసుకోవాలని భారత పౌరులకు విదేశాంగశాఖ సూచించింది. ఇరాక్‌లోని అమెరికా బేస్‌ క్యాంపులపై ఇరాన్‌ బాలిస్టిక్‌ క్షిపణులతో విరుచుకుపడింది. ఈనేపథ్యంలో భారత విదేశాంగ శాఖ గల్ఫ్‌లోని భారతీయులకు హెచ్చరికలు జారీచేసింది. గల్ఫ్‌, ఇరాన్‌, ఇరాక్‌ల మీదుగా ఎయిర్‌స్పేస్‌లను వాడకూడదని ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించింది. 
 
"ఇరాక్‌లో చోటుచేసుకున్న పరిణామాల దృష్ట్యా భారత ప్రభుత్వం నుంచి తదుపరి ప్రకటన వచ్చేవరకు భారతీయులు ఆ దేశానికి వెళ్లవద్దని సూచిస్తున్నాం. ఇరాక్‌లో ఇప్పటికే నివసిస్తోన్న వారు ఆ దేశంలో ప్రయాణాలు రద్దు చేసుకోవాలి" అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ ట్వీట్ చేశారు. 
 
అలాగే, బాగ్దాద్‌లోని భారత దౌత్య కార్యాలయ సిబ్బంది ఇరాక్‌లో ఉంటోన్న భారతీయులకు అన్ని రకాలుగా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని రవీశ్ కుమార్ వివరించారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇటీవలే భారత్‌ విమానయాన సంస్థలకు హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. వారం రోజుల్లో రెండో సారి భారత విమానయాన శాఖ హెచ్చరిక చేసింది. 
 
మరోవైపు, తమ వైమానిక స్థావరాలపై దాడులు జరిగిన అనంతరం అమెరికా స్పందించింది. ఇరాన్, ఇరాక్, గల్ఫ్ ఆఫ్ ఒమెన్ గగనతలం మీదుగా యూఎస్ విమానయాన సంస్థల విమానాలేవీ ప్రయాణించరాదని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇరాన్, సౌదీ అరేబియా సముద్ర జలాలపైనా ప్రయాణాలు సాగించవద్దని ఆదేశించింది.
 
కాగా, ఇరాక్‌లోని రెండు అమెరికా మిలిటరీ ఎయిర్ బేస్‌లపై ఇరాన్ 12 మిసైళ్లను ప్రయోగించిన సంగతి తెలిసిందే. దీన్ని సీరియస్గా తీసుకున్న ట్రంప్, ఇరాన్ తగిన ఫలితాన్ని అనుభవిస్తుందని హెచ్చరించారు. మరోవైపు ఈ ఉదయం టెహ్రాన్ సమీపంలో ప్రయాణికులతో వెళుతున్న విమానం కూలిపోవడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చాయి.