జపాన్ ప్రధాన మంత్రి షింజో అబేపై నెటిజన్ల ఫైర్
జపాన్ ప్రధాన మంత్రి షింజో అబేపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని చెబుతూ ఓ వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియోపై కొందరు నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ సోఫాలో కూర్చుని, కుక్క పిల్లను ఎత్తుకుని, టీ తాగుతూ, పుస్తకం చదువుతూ ఆయన సదరు వీడియోలో కనిపించారు. ప్రముఖ సంగీతకారుడు జెన్ హోషినో ఓ పాట పాడుతూ పెట్టిన వీడియోకి జపాన్ ప్రధాని ఈ మేరకు స్పందించారు.
అయితే కరోనా వైరస్ కారణంగా అనేక మంది ఇబ్బందులు పడుతుంటే... వారిని నిర్లక్ష్యం చేసే విధంగా అబే సందేశం ఉందంటూ కొందరు నెటిజన్లు విరుచుకుపడ్డారు. మీరెవరని అనుకుంటున్నారు.. అనే ట్యాగుతో షిబేపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ట్యాగ్ ప్రస్తుతం ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. 'ఓ వైపు ప్రాణాలు నిలబెట్టుకునేందుకు ప్రజలు పోరాడుతుంటే.. లగ్జరీ వీడియోలు చూపిస్తారా..? ఎవరూ ఏమీ చేయలేరు కానీ.. 'మీరెవరను కుంటున్నారు?' అని మాత్రం ఆశ్చర్యపోతారు..'' అని ఓ నెటిజన్ ప్రశ్నించాడు.
మరోవైపు కొందరు నెటిజన్లు మాత్రం షింజో అబేకి మద్దతుగా నిలబడ్డారు. ప్రధానమంత్రికి కూడా విశ్రాంతి సమయం ఉంటుందంటూ సమర్థిస్తున్నారు. కాగా జపాన్‌లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్యం ఏడువేలు దాటినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.