శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 22 ఆగస్టు 2019 (18:11 IST)

ఆర్టికల్ 370పై తాడోపేడో... యుద్ధం తప్పదేమో ఇమ్రాన్ ఖాన్

జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణను ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేసిన వ్యవహారంపై తాడోపేడో తేల్చుకుంటామని పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణం యుద్ధానికి దారితీయొచ్చని ఆయన వ్యాఖ్యానించారు.
 
ఇటీవల అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని మోడీ ఫోనులో మాట్లాడారు. ఇపుడు ఇమ్రాన్ ఖాన్ కూడా మాట్లాడారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, భారత్‌తో శాంతి చర్చలు జరిపేందుకు తాను చాలా సార్లు యత్నించానని, కానీ, ప్రతిసారి తమ చర్యలను భారత్ కేవలం బుజ్జగింపుల మాదిరిగానే భావిస్తోందని... ఇలాంటి పరిస్థితుల్లో ఇంతకు మించి తాము చేయగలిగింది ఏమీ లేదన్నారు. 
 
పైగా, ఇరు దేశాల మధ్య రోజురోజుకూ యుద్ధ వాతావరణం పెరుగుతోందని... ఇది చాలా ఆందోళన కలిగిస్తోందన్నారు. అధికరణ 370 రద్దుపై భారత్‌తో తాడోపేడో తేల్చుకుంటామని... అంతర్జాతీయ న్యాయస్థానంతో పాటు, ఐక్యరాజ్యసమితిలో బలమైన వాదనను వినిపిస్తామన్నారు. అదేసమయంలో కాశ్మీర్ అంశం లేకుండా భారత్‌తో ఎలాంటి చర్చలు ఉండబోవని ఇమ్రాన్ తేల్చి చెప్పారు.