గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 11 సెప్టెంబరు 2019 (08:05 IST)

అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం!

2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్​ ట్రంప్​ అనూహ్య విజయం సాధించడంలో రష్యా ప్రమేయం ఉందన్న మాట రాజకీయంగా పెను దుమారం రేగింది. తమ అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యాన్ని సహించబోమని ట్రంప్​ పలుమార్లు స్పష్టం చేశారు.

అయితే ఈ విషయంపై సెంట్రల్​ ఇంటిలిజెన్స్​ ఏజెన్సీకి చెందిన రష్యా గూఢచారి పలు విషయాలు తెలియజేసినట్లు వస్తున్న కథనాలు సంచలనం రేపుతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​ స్వయంగా ఆదేశాలు జారీ చేశారని ఆ గూఢచారి తెలియజేశాడన్నది కథనం సారాంశం.

అత్యంత సున్నితమైనది కావడం వల్ల అప్పటి సీఐఏ డైరక్టర్​ జాన్​ ఒ.బ్రెన్నాన్​ ఈ సమాచారాన్ని బయటకి రాకుండా గోప్యంగా ఉంచారట. ఈ సమాచారాన్ని పూర్తిగా సమీక్షించాల్సిందింగా సీఐఏ అధికారులను ఆదేశించారట. ఇది కచ్చితమైన సమాచారమా కాదా అన్న విషయంపై పూర్తి దర్యాప్తు జరిగినట్లు న్యూయార్క్ టైమ్స్​ కథనంలో పేర్కొంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రమేయంపై అనుమానాలు ఉన్నట్లు 2016లో ఇంటిలిజెన్స్​ అధికారులు తెలియజేశారు. మీడియాలో ఈ విషయంపై పలు కథనాలు రావడం వల్ల.. ఇంటిలిజెన్స్​ అధికారులు ఆ గుఢచారిని రష్యా నుంచి తప్పించారట.

అయితే గుఢచారిని తప్పించిన అనంతరం.. 2018 అమెరికా మధ్యంతర ఎన్నికలు, 2020 అధ్యక్ష ఎన్నికలల్లో రష్యా ప్రమేయంపై ఆధారాలు సేకరించేందుకు సీఐఏ అధికారులు ప్రయత్నిస్తున్నారని ఈ కథనం పేర్కొంది.

సీఎన్​ఎన్​ నివేదిక ప్రకారం.. సున్నిత సమాచారాన్ని ట్రంప్​ ప్రభుత్వం దుర్వినియోగం చేసే అవకాశమున్నందునే ఆ గూఢచారిని తప్పించారు. అయితే దీనికి కచ్చితమైన ఆధారాలు లేవని మాజీ ఇంటిలిజెన్స్​ అధికారులు పేర్కొన్నారు.