గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 ఏప్రియల్ 2020 (19:42 IST)

భారత్-పాకిస్థాన్‌ల మధ్య వన్డే సిరీస్ జరగాలి.. చెప్పిందెవరు?

దాయాది దేశాలైన భారత్-పాకిస్థాన్‌ల మధ్య వన్డే సిరీస్ నిర్వహించాలని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ విజ్ఞప్తి చేస్తున్నాడు. కరోనా బాధితులను ఆదుకునేందుకు ఈ ఇరు దేశాల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నిర్వహించడం మంచిదని అక్తర్ సూచించారు. భారత్-పాకిస్థాన్‌ల మధ్య 2007 నుంచి ద్వైపాక్షిక సిరీస్‌లు జరగలేదు. 
 
ఉగ్రవాద చర్యల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఇండో-పాక్ క్రికెట్ సిరీస్‌లు జరగలేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఈ జట్లు బరిలోకి దిగుతున్నాయి. అయితే.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో అక్తర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. 
 
కరోనా నుంచి కొంత ఉపశమనం కలిగిన తర్వాత భారత్‌, పాకిస్థాన్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నిర్వహిస్తే బాగుంటుందన్నాడు. కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా సిరీస్ నిర్వహిస్తే.. ఎవరు విజేత అనేదానితో సంబంధం లేకుండా భారీగా డబ్బు సమకూరే అవకాశం ఉంటుందని.. ఆ సొమ్మును ఇరు దేశాలు కరోనాపై పోరుకు వినియోగించాలని కోరాడు. 
 
ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లీ, బాబర్ ఆజమ్ సెంచరీలు సాధిస్తే ఆనందపడతామన్నాడు. మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా.. రెండు జట్లను విజేతలుగానే భావించొచ్చు. భారత్‌, పాక్ మధ్య మ్యాచ్ అంటే విపరీతమైన క్రేజ్ వుంది. ఇలాంటి పరిస్థితుల్లో డబ్బులు సమకూరుతాయని అక్తర్ వ్యాఖ్యానించాడు.