శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 8 సెప్టెంబరు 2021 (12:14 IST)

షరియా చట్టాల అమలులో వెనక్కి తగ్గేదే లేదు : తేల్చి చెప్పిన తాలిబన్లు

ఆప్ఘనిస్థాన్ దేశంలో మునుపటి తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తు చేసుకుంటూ షరియా చట్టాన్ని పక్కాగా అమలు చేస్తామని తాలిబన్ తీవ్రవాదులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆప్ఘన్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది. ఇక, వారి పాలన ఎలా ఉంటుందనే విషయంపైనే ఇప్పుడు అన్ని దేశాలు ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో తమ ప్రభుత్వ పాలన ఎలా ఉండబోతుందో తాలిబన్లు స్పష్టంగా చెప్పేశారు. దానికి సంబంధించిన విధాన నిర్ణయాన్ని ముల్లా హసన్ అఖుంద్ నేతృత్వంలోని తాలిబన్ల ప్రభుత్వం ప్రకటించింది. మునుపటి తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తు చేసుకుంటూ.. ప్రతి విషయంలోనూ షరియా చట్టాన్ని అమలు చేస్తామని తేల్చి చెప్పింది.
 
'రెండు అతిపెద్ద లక్ష్యాలను సాధించేందుకు మా గత ప్రభుత్వం 20 ఏళ్ల పోరాటం సాగించింది. మొదటిది విదేశీ ఆక్రమణల నుంచి దేశాన్ని విడిపించడం. రెండోది స్వతంత్ర స్థిర దేశంగా మార్చడం, కేంద్రీకృత ఇస్లామిక్ వ్యవస్థను ఏర్పాటు చేయడం' అని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నియమం ఆధారంగానే ప్రభుత్వాన్ని నడపడంలో పవిత్రమైన షరియా చట్టాలను అమలు చేస్తాం అని తేల్చి చెప్పింది. 
 
ప్రతిభ కలిగిన విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, వైద్యులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, టీచర్లు, వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులను తమ ప్రభుత్వం గౌరవిస్తుందని తెలిపింది. ఆఫ్ఘనిస్థాన్ కు వారి అవసరం ఎంతో ఉందని పేర్కొంది. ప్రజలెవరూ దేశాన్ని వీడొద్దని కోరింది. ఎవరినీ ఏం చేయబోమని చెప్పింది.