1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 4 మార్చి 2020 (08:01 IST)

పీఠం కోసం ట్రంప్ విశ్వప్రయత్నాలు

త్వరలో రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ గెలిచి పీఠం చేజిక్కించుకునేందుకు ట్రంప్ విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందుకోసం నమ్మిన మిత్రులను నట్టేట ముంచేసేందుకు కూడా వెనకాడటం లేదు.

ప్రతి అడుగులోనూ లాభనష్టాలను చూసుకుంటూ వ్యాపారవేత్తగా విశ్వరూపం చూపిస్తున్నారు. ఈ విషయంపై విశ్లేషకులు ఏం చెబుతున్నారో చూద్దాం. ఒక అత్యాశాపరుడు అందలమెక్కితే ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యవహార శైలి చూస్తే సరిపోతుంది.

ఓ వైపు నోబెల్‌ శాంతి బహుమతి పొందాలనే ఆశ- మరో వైపు అమెరికా అధ్యక్ష పదవికి రెండోసారి ఎన్నికవ్వాలనే లక్ష్యం. ఈ క్రమంలో ఆయన నిర్ణయాలు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. ఫలితంగా మధ్య ప్రాచ్యం, అఫ్గానిస్థాన్‌, వెనెజువెలా వంటి కీలక ప్రాంతాల్లో శాంతి కరవవుతోంది.

అమెరికా ఎన్నికలకు మరో తొమ్మిది నెలలే ఉండటంతో నమ్మిన మిత్రులను నట్టేట ముంచేసి స్వలాభం చూసుకొనే పనిలో ట్రంప్‌ నిమగ్నమయ్యారు. లాభనష్టాలను లెక్కలేసుకుంటూ ట్రంపులోని వ్యాపార వేత్త విశ్వరూపం చూపిస్తున్నాడు.

దానికి తాజా ఉదాహరణే అమెరికా- తాలిబన్‌ శాంతి ఒప్పందం. దోహాలో తాలిబన్ల తరఫున ముల్లా బరాదర్‌, అమెరికా పక్షాన ఆ దేశ ముఖ్య చర్చల ప్రతినిధి జల్మే ఖలీజాద్‌లు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. పాకిస్థాన్‌, టర్కీ, ఇండొనేసియా, చైనా తదితర దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు.