శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By శ్రీ
Last Modified: సోమవారం, 19 ఆగస్టు 2019 (15:14 IST)

'ఎవరు’ మా అంచనాలను మించి రెస్పాన్స్‌ : దర్శకుడు వెంకట్ రాంజీ ఇంటర్వ్యూ

టాలెంటెడ్ హీరో అడివి శేష్, రెజీనా క‌సండ్ర, నవీన్ చంద్ర కీలక పాత్రలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ ‘ఎవరు’. ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి సినిమా బ్యానర్‌ పైన వెంకట్ రాంజీని దర్శకుడిగా పరిచయం చేస్తూ పెర‌ల్ వి.పొట్లూరి, ప‌ర‌మ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె నిర్మించిన ఈ సినిమా ఆగష్టు 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజై క్యాప్టివేటింగ్ హిట్‌గా ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం పొందుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు వెంకట్ రాంజీ ఇంటర్వ్యూ.. 
 
ఎవరు మూవీ రెస్పాన్స్‌ ఎలా ఉంది?
సినిమా ఇంకా 30 శాతం చిత్రీకరించాల్సి ఉండగా నేను ఫైనల్ కట్ చూశాను. నాకు అప్పుడే కాన్ఫిడెంట్ పెరిగింది. ప్రాజెక్ట్ నెక్ట్స్ లెవల్‌లో ఉంటుందే తప్ప.. తగ్గదనిపించింది. రెజీనా, నవీన్‌చంద్రకు అప్పుడే చెప్పాను. ఇప్పుడు చేయబోయే నాలుగైదు సీన్స్ పండాయంటే సినిమా ఆకట్టుకుందన్నాను. సినిమాను ఎక్కువసార్లు చూస్తే ఎక్కువగా ప్రేమించేస్తానేమో అనుకున్నాను. కామన్ ఆడియెన్‌కి తెలియకపోవచ్చు కానీ.. నేను చేసిన చిన్న చిన్న తప్పులేంటనేది నాకు తెలుస్తుంటుంది. 
 
కాబట్టి సినిమాను ఎక్కువగా కూడా చూడలేదు. ఫైనల్ ఎడిటింగ్ సమయంలో లాక్ చేసే సమయంలో పూర్తి చూశాను. మల్టీప్లెక్ సినిమా అనుకున్నాను. ఎందుకంటే నేనైనా, శేష్ అయినా అమెరికా నుండి చదువుకుని వచ్చాం. అందుకే మాకు మాస్ పల్స్ తెలియవని పీవీపీగారు తిడుతుంటారు. కానీ సినిమా నా అంచనాలను మించి రెస్పాన్స్‌ను రాబట్టుకుంటుంది. సింగిల్ స్క్రీన్స్‌లో ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్నారు.
 
ఎవరు స్టోరీ వినగానే ఎలా ఫీల్ అయ్యారు?
'ది ఇన్విజబుల్ గెస్ట్` పాయింట్‌ని పీవీపీగారు చెప్పగానే కనెక్ట్ అయ్యాను. నేను ఆ సమయంలో సినిమాను థ్రిల్లర్‌లా కాకుండా రివేంజ్ స్టోరీలా చూశాను. న్యాయం కోసం పోరాడే యువకుడి కథే ఇది. దాన్ని డెవలప్ చేసుకుంటూ రావడం వల్ల థ్రిల్లర్‌లా అనిపించింది. ఒరిజినల్ సినిమా `ది ఇన్విజబుల్ గెస్ట్‌`ను ఎప్పుడో నార్మల్‌గా చూసేశాను. నాకు ఓకే అనిపించింది. అదే పాయింట్‌ను పీవీపీగారు చెప్పారు. బాగానే ఉందని అనుకున్నాను. అప్పుడు అసలు సినిమా గురించి చెప్పారు. తర్వాత మరోసారి నేను ఆ సినిమాను చూశాను.
 
ది ఇన్విజబుల్ గెస్ట్ మూవీ కూడా ఇదే తరహాలో ఉంటుంది కదా?
ది ఇన్విజబుల్ గెస్ట్ మూవీలోని ఎమోషన్స్ మన తెలుగు నెటివిటీకి సంబంధించింది కాదు. మనం కథలు రాస్తున్నప్పుడు ఓ ఎమోషనల్ ఫీల్ కావాలి. లేకపోతే కనెక్ట్ కాదు. తెలుగు ఆడియెన్స్‌కి బాగా కనెక్ట్ కావాలని ఎమోషన్స్ విషయంలో వర్కవుట్ చేశాం. మాతృకకి మనకు చాలా తేడాలుంటాయి. ఆ విషయంలో నేను చాలా హ్యాపీగా ఫీలవుతాను. హిందీలో దీన్నే`బద్లా` పేరుతో రీమేక్ చేస్తున్నారని తెలుసు. అయితే మేం మాతృక నుండ అడాప్ట్ చేసుకున్న విషయాల్లో దేన్నీ మార్చాలనుకోలేదు. ప్రతి క్యారెక్టర్‌కి ఓ లేయర్‌ను తీసుకొచ్చాం. అందుకే ఆడియెన్స్ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు.
 
పీవీపీ గారి బేనర్లో వర్క్ చేయడం ఎలా ఉంది?
నేను పీవీపీ సినిమా బ్యానర్‌లో ఊపిరి, క్షణం, బ్రహ్మోత్సవం సినిమాలకు మార్కెటింగ్ విభాగంలో పనిచేశాను. పెద్ద సినిమాలు చేశాం. మరోసారి చిన్న సినిమా చేద్దామని పీవీపీగారు అనుకున్నారు. అలాంటి టైమ్‌లో పీవీపీగారు నాకు ఈ పాయింట్ చెప్పారు. ఆయనే శేష్‌తో కూడా మాట్లాడారు. క్షణంతో చిన్న సినిమాల పరంగా ఓ మాడ్యుల్ సెట్ చేశాం. దాన్ని మళ్లీ రిపీట్ చేయాలనుకున్నారు.
 
ఈ సినిమాకు రెజీనానే ఫస్ట్ ఛాయిస్సా?
రెజీనా దాదాపు 7-8 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంది. ఆమెకు ఎలాంటి సినిమాలు చేయాలో తెలుసు. తను చాలా సినిమాలు చేశాయి. `అ!` నుండి తన పంథా మార్చుకుంది. ఇకపై కెరీర్‌లో ఏ సినిమా చేసినా ఓ గట్ ఫీలింగ్‌తో చేస్తుందని నేను నమ్ముతున్నాను. తను ఎక్స్‌ప్రెసివ్.. సెటిల్డ్‌గా నటిస్తుంది. ఈ సినిమా విషయానికి వస్తే.. తను క్యారెక్టర్‌లోని లేయర్స్ పరంగా అద్భుతంగా నటించింది.
 
నవీన్ చంద్ర, నిహాల్‌ క్యారెక్టర్స్ కూడా మంచి అప్లాజ్ వస్తుంది కదా?
నవీన్ చంద్రని నేను హీరోగానే చూశాను. తను సోలోగా హీరోగా సినిమాలు చేసుకుంటున్నాడు. అలాంటి సమయంలో మా సినిమాలో నటిస్తాడని నేను నమ్మలేదు. `అరవిందసమేత` చూసిన తర్వాత తనకి కథ వినమని మెసేజ్ పెట్టాను. తను విని చేస్తానని చెప్పాడు. ఆదిత్య వర్మ పాత్ర కోసం మేం ముగ్గురు చిన్న అబ్బాయిలను తీసుకోవాలని అనుకున్నాం. అందులో నిహాల్‌ని చూడగానే తనలో ఇన్నోసెన్స్ బాగా నచ్చేసింది. ముగ్గురుని లుక్ చేసి నిహాల్‌ని ఎంపిక చేసుకున్నాం.
 
స్టోరీ పరంగా శేష్ ఎలాంటి సలహాలు ఇచ్చారు?
మనం వంద ఆలోచనలను చెబితే అందులో మంచిదేదో సెలక్ట్ చేసుకోవడం శేష్‌కి బాగా తెలుసు. కథకు స్టోరీ పరంగా శేష్, అబ్బూరిరవిగారు హెల్ప్ అయ్యారు. ఇంటర్వెల్ సమయంలో అబ్బూరి రవిగారు చూసి ఎమోషన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇంకా బావుండాలని అన్నారు. నేను మళ్లీ మార్చి రాసుకున్నాను. ఈ సినిమా పరంగా శేష్, అబ్బూరి రవిగారు తొలి ప్రేక్షకులుగా భావిస్తున్నాను. వారి సలహాల ప్రకారం మార్పులు, చేర్పులు చేశాను. శేష్ రెండు థ్రిల్లర్ సినిమాలు చేశాడు. తనకు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎంత ఇవ్వాలనే దానిపై క్లారిటీ ఉంది. కాబట్టి నేనెక్కడైనా ట్రాక్ తప్పినట్లు అనిపించినా తను సలహాలిస్తాడు. ఈ సినిమా యాక్షన్ లేదు కాబట్టి డైలాగ్స్ విషయంలో చాలా కేర్ తీసుకున్నారు.
 
తదుపరి చిత్రాల గురించి?
వారం పదిరోజుల తర్వాత తదుపరి కథతో హీరోలను కలవాల్సి ఉంది. నేను మొదట అనుకున్న కథతో సినిమా చేసే అవకాశం ఉందనుకుంటున్నాను. అది కూడా థ్రిల్లర్ సబ్జెక్ట్. దాదాపు ఇదే టీమ్‌తో కంటిన్యూ అవుతాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు.