శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By ivr
Last Modified: బుధవారం, 1 నవంబరు 2017 (17:57 IST)

సన్నీ లియోన్‌ను చూసి సెన్సార్ వారు బాగా ఎంజాయ్ చేశారు...: ప్రవీణ్‌ సత్తార్‌ ఇంటర్వ్యూ

'చందమామ కథలు'లో సామాజిక కోణాల్ని, 'గుంటూరు టాకీస్‌'తో యువతీ యువకుల్లోని ఓ కోణాన్ని ఆవిష్కరించిన దర్శకుడు ప్రవీణ్‌ సత్తార్‌. ప్రస్తుతం డా. రాజశేఖర్‌తో 'గరుడవేగా' చిత్రాన్ని రూపొందించారు. చిత్రీకరణలో బడ్జెట్‌ పరిధి మూడింతలు కావడం, సెన్సార్‌ నుంచి పలు ఇ

'చందమామ కథలు'లో సామాజిక కోణాల్ని, 'గుంటూరు టాకీస్‌'తో యువతీ యువకుల్లోని ఓ కోణాన్ని ఆవిష్కరించిన దర్శకుడు ప్రవీణ్‌ సత్తార్‌. ప్రస్తుతం డా. రాజశేఖర్‌తో 'గరుడవేగా' చిత్రాన్ని రూపొందించారు. చిత్రీకరణలో బడ్జెట్‌ పరిధి మూడింతలు కావడం, సెన్సార్‌ నుంచి పలు ఇబ్బందుల నుంచి బయటపడి ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా బుధవారం నాడు దర్శకుడు పలు విషయాలను వెల్లడించారు. 
 
ఈ సినిమా ఎలా మొదలయింది?
నేను ఎక్కువగా బాలీవుడ్‌ సినిమాల నుండి ప్రేరణ పొందుతాను. ఈ సినిమా స్క్రిప్ట్‌ 2006లో రాసుకున్నాను, మొదట ఈ సినిమాకు 'మగాడు' అనే టైటిల్‌ పెడదాం అనుకున్నాం. కానీ అనేక తర్జనభర్జనల అనంతరం 'గరుడవేగా' టైటిల్‌ నిర్ణయించాం. టైటిల్‌లో వుండే పిఎస్‌వి.. 176.23 అనేది ఎందుకు పెట్టామనేది సినిమా చూడాల్సిందే.
 
స్క్రిప్ట్‌లో ఎలాంటి మార్పులు చేశారు?
మొదట కథ రాసుకున్నప్పుడు ఈ సినిమాలో హీరో సిఐ. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులకు అనుకూలంగా హీరో క్యారెక్టర్‌ మార్చాల్సి వచ్చింది, ఇప్పుడు మా సినిమాలో హీరో నేషనల్‌ ఇంటిలిజెన్స్‌ ఏజెన్సీలో వర్క్‌ చేస్తాడు.
 
మొదటిసారి యాక్షన్‌ సినిమా చేస్తున్నారు, ఎలా అనిపించింది?
యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరించడం థ్రిల్లింగ్‌గా ఉంది. భవిష్యత్తులో మరిన్ని యాక్షన్‌ సినిమాలు తీయాలనుకుంటున్నాను. టాప్‌ టెక్నీషియన్స్‌తో పని చెయ్యాలని ఉంది.
 
రాజశేఖర్‌ మీద ఇంత బడ్జెట్‌ లాభిస్తుందనుకుంటున్నారా?
ప్రతిచోటా ఇదే ప్రశ్న అడుగుతున్నారు, ఎందుకో నాకు అర్థం కావడంలేదు, 'అర్జున్‌ రెడ్డి' సినిమా 4 కోట్లలో తీశారు. అదీ కొత్త దర్శకుడితో, కానీ సినిమా 30 కోట్లు వసూళ్ళు చేసింది. బడ్జెట్‌కి సినిమా ఫలితానికి సంబంధం లేదనేది నా భావన. సినిమా బాగుంటే చాలు. బడ్జెట్‌ మేటర్‌ కాదు. సినిమాలో విషయం వుండాలి. ప్లానింగ్‌ వుంటే 8 కోట్లతో తీయవచ్చు. సినిమా బడ్జెట్‌తో దర్శకుడికి సంబంధమేలేదు. 
 
మన దగ్గర.. కథ పట్టుకుని వస్తే బడ్జెట్‌ ఎంత?అంటారు. అది లైన్‌ ప్రొడ్యూసర్‌ పని. వారు ఎం.బి.ఎ. చదివితే అర్థమవుతుంది. దర్శకుడనేవాడు ఎవరికి ఏ పాత్ర ఇవ్వాలన్నదే చూస్తాడు. దర్శకుడికి మేనేజ్‌మెంట్‌కు సంబంధంలేదు. తను క్రియేటివ్‌ పర్సన్‌. రైటర్‌ స్క్రిప్ట్‌ను స్టూడియోకు ఇస్తే, ఈ స్క్రిప్ట్‌కి ఈ దర్శకుడయితే బాగుంటుందని లైన్‌ ప్రొడ్యూసర్స్‌ భావిస్తారు. ప్రొడక్షన్‌, లైన్‌ ప్రొడ్యూర్‌ కలిసి షెడ్యూల్స్‌, ఖర్చు వేస్తారు.
 
అయితే మీరు బడ్జెట్‌ గురించి పట్టించుకోరా?
నేను బడ్జెట్‌ను అస్సలు పట్టించుకోను, కథను నమ్మి సినిమాను ప్రారంభిస్తాను, కథకు కావాల్సినవన్నీ ఉన్నాయా... లేదా... చూసుకుంటాను. సినిమా బాగా రావడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. స్క్రిప్ట్‌లోనే లొకేషన్‌లు వుంటాయి. దాని ప్రొడక్షన్‌ వాల్యూ చూసుకుంటాను. స్క్రిప్ట్‌ లేకుండా షూటింగ్‌కు వెళితే బడ్జెట్‌ ఎక్కువవుతుంది. నాకు తెలిసి రాజశేఖర్‌గారి సినిమాలన్నీ స్క్రిప్ట్‌ లేకుండా చేశారట. ఈ సినిమానే స్క్రిప్ట్‌తో వచ్చారని చెప్పారు.
 
జార్జియా వంటి ఖరీదైన ప్రాంతాల్లో తీయడానికి కారణం?
కథంతా ఇండియాలోనే జరుగుతుంది. అందుకే శ్రీశైలం డ్యామ్‌ అయితే బాగుంటుందని భావించాం. కానీ దానిపైన విమానం ఎగురుతుంటే, పది పారాచ్యూట్స్‌ వైజాగ్‌ నుంచి స్పీడ్‌ బోట్లలో జనాలు వచ్చి, డ్యామ్‌ లోపలకు వెళ్ళి పది బాంబులు పెట్టి ప్రజల్ని చంపాలి. దానికి మనవాళ్లు పర్మిషన్‌ ఇవ్వలేదు. డ్యామ్‌ కూలిపోతుందన్నారు. అందుకే జార్జియా సరైన ప్రాంతమని అక్కడకు వెళ్ళాం. అది చాలా ఎత్తయిన డ్యామ్‌. అక్కడ మాకు చాలా ఫ్రీడమ్‌ ఇచ్చారు. రష్యా, జార్జియా మధ్యలో వున్న ప్రాంతమది. అక్కడ మేకింగ్‌ ఛాలెంజ్‌గా వుంది. మైనస్‌ 4 డిగ్రీల్లో షూటింగ్‌ చేయాల్సివచ్చింది. కెమెరా జాగ్రత్తలు తీసుకున్నాం. 
 
గుంటూరు టాకీస్‌ కూడా చర్చకు తావిచ్చింది?
అది ఫ్యామిలీ సినిమా కాదని ప్రమోషన్‌లోనే చెప్పాను. భార్యభర్తలయితే వారి వారి ఫ్రెండ్స్‌తోనే వెళ్ళమని చెప్పాను. హైదరాబాద్‌లో ఓ థియేటర్‌కు కుటుంబం వచ్చింది. వారిని చూసి మేనేజర్‌తో మాట్లాడి... డబ్బు వాపస్‌ ఇప్పించాను. వారు వెళ్ళిపోయారు. ఆ సినిమా 21 కోట్ల క్రాస్‌ చేసింది.
 
సన్నీ లియోన్‌ను తీసుకోవడానికి కారణం?
కేవలం కమర్షియల్‌ కోసమే. అదనపు ఆకర్షణ కోసం ఆమెను సంప్రదించడం జరిగింది. ఆమె పాటకు మంచి ఆదరణ లభిస్తుంది. సెన్సార్‌ వారు బాగా ఎంజాయ్‌ చేశారు కూడా. దీనికి కట్‌ ఇవ్వలేకపోయారు.
 
తదుపరి చిత్రం?
పుల్లెల గోపీచంద్‌ బయోపిక్‌. సుధీర్‌ బాబుతో హిందీ, తెలుగులో తీయబోతున్నాం. వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభిస్తాం.
 
- ఇంటర్వ్యూ.. మురళీశక్తి.