సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ముఖాముఖి
Written By శ్రీ
Last Modified: సోమవారం, 8 జులై 2019 (20:59 IST)

దొరసాని మొదటి సన్నివేశానికి చాలా టెన్షన్ పడ్డా… శివాత్మిక రాజశేఖర్

ఆనంద్ దేవరకొండ, శివాత్మకలను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్టైన్మెంట్, బిగ్ బెన్ సినిమాలు సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ ‘దొరసాని’ జులై 12న గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న ఈ మూవీ ట్రైలర్, పాటలతో ప్రేక్షకుల మనసులో ప్రత్యేకమైన ముద్రను వేసింది. కె.వి.ఆర్. దర్శకునిగా పరిచయం అవుతున్నారు. దొరసాని ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ శివాత్మిక చెప్పిన చిత్ర విశేషాలు మీకోసం..
 
సినిమాల్లోకి వచ్చారు కదా... ఎక్సైట్ ఫీలయ్యారా?
షూటింగ్స్ అనేవి నా ఊహ తెలిసినప్పటి నుండి నా జీవితంలో భాగం అయ్యాయి. స్కూల్ కన్నా ఎక్కవుగా షూటింగ్‌లోనే టైం స్పెండ్ చేసేదానిని. నేను హీరోయిన్ అవుతానంటే అందుకేనేమో ఇంట్లో ఎవరూ పెద్దగా సర్ప్రైజ్ అవలేదు. కానీ దొరసాని రిలీజ్ టైం దగ్గర పడుతున్నప్పుడు మాత్రం ఇంట్లో సందడి ఎక్కువవుతుంది.
 
దొరసాని చిత్రం అనుభవాలు చెప్తారా?
ఈ కథ వింటున్నప్పుడు నా పాత్ర బాగా నచ్చింది. దర్శకుడు మహేంద్ర ఆ క్యారెక్టర్‌ని వివరించిన విధానం నన్ను బాగా ఇంప్రెస్ చేసింది. మొత్తం నాలుగు గంటల సేపు కథ చెప్పారు. ఆ తర్వాత ఆడిషన్స్ నన్ను ఆనంద్‌ని కలిపే చేసారు. ఆడిషన్స్ కూడా అయ్యాక రెండు నెలలు  నాకు ఎలాంటి కబురు అందలేదు. ఆ టైంలో ఆ పాత్ర కోసం నేను ఎదురుచూసాను. నేనే అని తెలిసాక చాలా ఎగ్జైట్ అయ్యాను.
 
మీ పాత్ర ఎలా వుంటుంది?
పాత, కొత్త అలాంటి తేడాలు ప్రేమకథలకు ఉండవు అని నేను నమ్ముతాను. మోడ్రన్ గాళ్‌గా కనిపించాలని అనుకోలేదు. పిరియాడిక్ మూవీస్ అంటే బాగా ఇష్టపడతాను. ఈ ప్రేమకథలో కనిపించే స్వచ్ఛత నన్ను బాగా ఆకర్షించింది. అందుకే నేను చాలా ఇష్టపడి చేసాను. నేను సంజయ్ లీలా భ‌న్సాలి సినిమాలకు పెద్ద ఫ్యాన్. అలాంటి కథతోనే ఇంట్రడ్యూస్ అవడం చాలా ఆనందంగా ఉంది.
 
దర్శకుడు కె.వి.ఆర్ మహేంద్రతో అనుభవం ఎలా వుంది?
పాత్రలకోసం రాసుకున్న సన్నివేశాలు ఏమీ లేవు. ఆయన కథతోనే మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళారు. నేను ఒక డైలాగ్ చెప్పకుండానే నన్ను సెలెక్ట్ చేసానని షూటింగ్ అయ్యాక చెప్పారు. ఆయన సన్నివేశాలను బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఆయన చెప్పిన దాన్ని చేసుకొని చేసుకుంటూ వెళితే చాలు. మొదటి సన్నివేశానికి చాలా టెన్షన్ పడ్డాను, కానీ దర్శకుడు ఇచ్చిన కాన్ఫిడెన్స్ నన్ను నడిపించింది.
 
అమ్మ జీవిత సినిమాలు చూసేవారా?
ఈ కథ 80 దశకాల్లో జరిగే కథ అప్పటి కట్టు బొట్టు గురించి నాకు పెద్దగా తెలియదు. తలంబ్రాలు టైంలో అమ్మ అలంకరణ, స్టైల్‌ని రిఫరెన్స్‌లా తీసుకున్నాను. అచ్చం అమ్మాలాగే ఉన్నావని షూటింగ్ లోకేషన్స్‌లో అంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మ నాకు ఒకటే చెప్పేవారు ఏ క్యారెక్టర్ చేస్తున్నా ఇన్వాల్వ్ అయి చేయమని చెప్పేవారు. అమ్మ నాకు ఎప్పుడూ ఒక ఎనర్జీ సోర్స్‌లాగా ఉంటుంది.
 
ప్రేమ సన్నివేశాల్లో నటించేటపుడు...
చాలా ప్రేమకథలలో కనిపించే స్వేచ్ఛ ఈ ప్రేమ కథలో ఉండదు. మా ప్రేమ  కళ్ళలోనే తెలుస్తుంది. అదే ఈ కథను కొత్తగా ప్రజెంట్ చేస్తుంది. నా క్యారెక్ట్‌కి పెద్దగా డైలాగ్‌లుండవు.. నా పాత్ర లోని ఎమోషన్స్ అన్నీ కళ్ళలోనే పలుకుతాయి. అదే ఛాలెంజ్‌గా అనిపించింది. దొరసానిగా కెమెరా ముందు నిలబడే కాన్ఫిడెన్స్ డైరెక్టర్ మహేంద్ర నుండే వచ్చింది. కోదాడ దగ్గర ఒక గుడిలో 25 డేస్ షూట్ చేసాము. అది నాకు మంచి ఎక్స్‌పీరియన్స్‌గా మిగిలిపోతుంది. నేను చేస్తానో లేదో అనే సందేహాలు ఎప్పుడూ లేవు. నేను చెస్తాను అని బలంగా నమ్మేవారు. ఆ నమ్మకమే నన్ను నడిపించింది.
 
రాజశేఖర్ కూతురిగా ఎలా అనిపిస్తోంది?
నాన్నకుండే ఇమేజ్‌ని చిన్నతనం నుండి చూస్తూ పెరిగాను. ఈ మద్యనే కల్కి రిలీజ్ అయి ఆ సినిమా తెచ్చిన సందండి ఇంట్లో తగ్గకముందే నా సినిమా రిలీజ్‌కి వచ్చేసింది. నాన్న నా సినిమా గురించి అందరికీ గొప్పగా చెబుతుంటే చాలా ఆనందంగా ఒక పక్క టెన్షన్‌గా కూడా ఉంది.  నాన్న ఇమేజ్ తెచ్చే ఒత్తిడి కంటే ఆనందమే ఎక్కువ. నాన్న డైరెక్టర్స్ హీరో గానే ఉన్నారు, నేను అదే ఫాలో అవుతున్నాను.
 
గడీల కథలు చదివారా?
దొరసాని పాత్ర అంగీకరించాక, గడీల గురించి కొంచెం చదువుకున్నాను. దొరల గురించి, దొరసానిల గురించి తెలుసుకున్నాను. 150 యేళ్ళ నుండి ఉన్న గడిలో షూటింగ్ చేసాము. షూటింగ్‌లో జరుగుతున్నప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ గడీల గురించి చెప్పేవి విని చాలా ఆశ్చర్యపోయాను. దొరసాని అనే అమ్మాయికి బయట ప్రపంచం తెలియకుండా పెరుగుతుంది. ఆ గడీనే ప్రపంచంగా పెరుగుతుంది. రాజు దొరసాని జీవితంలోకి వచ్చాక ఏం జరిగింది అనేదే కథ..? కానీ రాజు దొరసానిని చేరుకోవడానికి ఏం చేస్తాడు అనేది ఒక రియలిస్టిక్‌గా చూపించాడు దర్శకుడు.
 
ఆనంద్ దేవరకొండ గురించి...
ఆనంద్‌తో వర్క్ చేయడం చాలా కంఫర్ట్ గా ఉంది. చాలా తక్కువ మాట్లాడతాడు. కానీ షూటింగ్‌లో నెమ్మదిగా ఫ్రెండ్స్ అయ్యాము. నాకంటే ముందే ఆనంద్ సెలెక్ట్ అయ్యాడు. సెట్‌కి వెళ్ళాక రాజు క్యారెక్టర్ ఆనంద్ కంటే బెటర్‌గా ఎవరూ చేయరేమో అనిపించింది. చాలా బాగా హార్డ్ వర్క్ చేసాడు. తెలంగాణ స్లాంగ్ కోసం చాలా బాగా ప్రాక్టీస్ చేసాడు. అతని నటన గురించి రిలీజ్ అయ్యాక మాట్లాడుకుంటారు.
 
ఇంకా ఏమైనా అంగీకరించారా?
ఇంకా కథలు ఏమీ ఒప్పుకోలేదు. నా ఏజ్ తగ్గ కథలు చేద్దామనుకుంటున్నాను. దొరసానిగా నా నటనకు ప్రేక్షకులు ఇచ్చే ఫీడ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నాను. అమ్మానాన్నలు ఈ సినిమాపై, నా నటనపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఇంట్లో ఇప్పుడు అందరూ మాట్లాడుకునే టాపిక్ దొరసాని గురించే. అందుకే దొరసాని తర్వాత మిగిలిన కథల గురించి ఆలోచిస్తాను.