శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: మంగళవారం, 2 జులై 2019 (11:56 IST)

మంచినీళ్లు కావాలని అడిగితే ముద్దు పెడుతుంది.... 'దొరసాని'పై సుకుమార్

దొర‌సాని సినిమా ఆర్టిస్టులు మాట్లాడ‌డంలో నిజాయితీ, సినిమాలో నిజాయితీ, క‌థ ఎంచుకోవ‌డంలో నిజాయితీ, అలాగే వేరే భాష న‌టుల‌ను కాకుండా మ‌న‌లోనే న‌టుల‌ను వెతుక్కొని తీయ‌డం న‌చ్చింది అని ద‌ర్శ‌కుడు సుకుమార్ దొర‌సాని ట్రైల‌ర్ రిలీజ్‌లో చెప్పారు. ఈ సంద‌ర్భంగా సుకుమార్ స్పందిస్తూ.... చిన్న సినిమా ద్వారా మంచి ఆర్టిస్టుల‌ను ప‌రిచ‌యం చేస్తున్నారు. కొత్త డైరెక్ట‌ర్స్ వ‌ల్ల‌.. కొత్త ప్రొడ్యూస‌ర్స్ వ‌ల్ల స్వ‌రూప‌మే మారిపోతుంది. 
 
ఇవ‌న్నీ చూసే రంగ‌స్థ‌లంలో కొంత ట్రై చేసాను. క‌మ‌ర్షియ‌ల్ సినిమాలో కొంత నిజాయితీ పెట్ట‌డానికి ట్రై చేసాను. ముఖ్యంగా మ‌ధుర శ్రీధ‌ర్ రెడ్డి గారు ఎం.ఎస్ గోల్డ్ మెడ‌లిస్ట్ అయ్యుండి కూడా సినిమా రంగంలోకి వ‌చ్చి కొత్తకొత్త డైరెక్ట‌ర్స్‌ని ప‌రిచ‌యం చేయ‌డం.. కొత్త టెక్నీషియ‌న్స్‌ని ప‌రిచ‌యం చేయ‌డం.. ఆయ‌న సినిమాల‌ను డైరెక్ట్ చేయ‌డం.. సినిమాల‌ను ప్రొడ్యూస్ చేయ‌డం.. ఇలా ఇండ‌స్ట్రీ క‌ళ‌క‌ళ‌లాడానికి త‌న వంతు స‌హకారం అందిస్తున్న శ్రీధ‌ర్ గారికి థ్యాంక్స్ తెలియచేస్తున్నాను. 
 
దొర‌సాని ట్రైల‌ర్ చూసాను. డైరెక్ట‌ర్ మ‌హేంద్ర గురించి ఇప్పుడే విన్నాను. నిషిది అనే ఒక షార్ట్ ఫిల్మ్ తీసాడు. 39 ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ప్ర‌ద‌ర్శింత‌మైంది. శ్యామ్ బెన‌గ‌ల్‌గారు ప్ర‌త్యేకంగా త‌న స్పంద‌న తెలియ‌చేస్తూ ఈ మెయిల్ చేసార‌ట‌. అంత‌క‌న్నా గొప్ప విష‌యం ఏముంటుంది. ఆయ‌న్ని నేను పూజిస్తాను. అలాంటి గొప్ప ద‌ర్శ‌కుడితో... ఈ సినిమా తీయ‌క‌ముందే గొప్ప ద‌ర్శ‌కుడు అనిపించుకున్నాడు మ‌హేంద్ర‌. కొత్త ద‌ర్శ‌కుడి తీసిన విజువ‌ల్స్‌లా లేవు. ఇప్పుడు వ‌స్తున్న కొత్త ద‌ర్శ‌కులు చాలా బాగా తీస్తున్నారు. సీనియ‌ర్ డైరెక్ట‌ర్స్‌లా తీస్తున్నారు అది గొప్ప విష‌యం.
 
నీళ్లు తాగొచ్చా అంటే అమ్మాయి ముద్దు పెట్టుకుంటుంది క‌దా... అన్నం ఉడికిందో లేదో చెప్ప‌డానికి ఒక మెతుకు చాలు అంటారు క‌దా.. ఆ సీన్ చాలు ద‌ర్శ‌కుడి గొప్ప‌త‌నం చెప్ప‌డానికి... ఈ ద‌ర్శ‌కుడిని గుర్తించిన శ్రీధ‌ర్ గారి గొప్ప‌త‌నం చెప్ప‌డానికి. కంచ‌ర‌పాలెం, మెంట‌ల్ మ‌దిలో, పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి కావ‌చ్చు. మ‌ల్లేశం కావ‌చ్చు ఆత్రేయ కావ‌చ్చు బ్రోచేవారెవ‌రు రా..ఇలా అన్నీ కొత్తకొత్త కాన్సెప్ట్స్. ఈ అన్ని సినిమాల వెన‌క ఒక వ్య‌క్తి ఉన్నాడు. అత‌నే వెంక‌ట్ సిద్ధారెడ్డి. ఆయ‌న గొప్ప సాహితీ వేత్త‌. బోల‌డ‌న్ని పుస్త‌కాలు రాసారు. పుస్త‌కాలు రాసేవారు సినిమాల్లోకి వ‌స్తే.. ఎంత అంద‌మైన సినిమాలు వ‌స్తాయో. సినిమా భ‌విష్య‌త్ మారుతుంది అని చెప్ప‌డానికి నిద‌ర్శ‌నం సిద్ధారెడ్డి గారు.
 
ఆయ‌న ఇండ‌స్ట్రీలో ఉండ‌డం వ‌ల‌న చాలా హెల్ప్ అవుతుంది క‌థ‌ల‌కి. సినిమాల‌కి న‌వ‌ల‌ల‌కి అనుబంధం ఉండేది. ఇప్పుడు లేదు. ఇంత‌కు ముందు న‌వ‌ల చూసి సినిమా తీసేవారు. ఇప్పుడు మా క‌థ మేమే రాసుకోవాల్సి వ‌స్తుంది. అందువ‌ల క‌థ రాయాలంటే సంవ‌త్స‌రం ప‌డుతుంది. అలా కాకుండా ర‌చయిత‌లు వేరు.. ద‌ర్శ‌కులు వేరుగా ఉంటే..చాలా బాగుంటుందని నా అభిప్రాయం. నిజంగా చెప్పాలంటే ర‌చ‌న వేరు ద‌ర్శ‌క‌త్వం వేరు. ర‌చ‌యిత క‌థ తీసుకువ‌స్తే..ద‌ర్శ‌కుడు ఇంకా విజువ‌లైజ్ చేసుకోవ‌డానికి వీలుంటుంది. అలాంటి అవ‌కాశం లేకుండా పోయింది తెలుగు ఇండ‌స్ట్రీలో. మ‌ళ్లీ ర‌చ‌యిత‌లు ముందుకు వ‌స్తే.. మంచి క‌థ‌లు వ‌స్తాయి.
 
ఈ సినిమాలో పాట‌ల గురించి చెప్పాలంటే... గోర‌టి వెంక‌న్న గారికి పెద్ద ఫ్యాన్ ని.ఈ సినిమాలో అద్భుత‌మైన పాట రాసారు ఆయ‌న‌. పాట‌ల్లో సాహిత్యం చెప్ప‌డంలో ఆయ‌న బెస్ట్ అని చెప్ప‌చ్చు. జీవిత గారు శివాత్మిక గురించి ఎంత త‌ప‌న ప‌డ‌తారో తెలుసు. త‌లంబ్రాలు సినిమాలో జీవిత గారు ఎంత స‌హ‌జంగా న‌టించారో మ‌ళ్లీ నేను శివాత్మిక‌ను చూసాను ఈ సినిమాలో. క‌రెక్ట్ తెలంగాణ అమ్మాయిలా ఉంది. మంచి హీరోయిన్ కావాల‌ని కోరుకుంటున్నాను. ఆనంద్ దేవ‌ర‌కొండ మాట‌ల్లో నిజాయితీ న‌చ్చింది. విజ‌య్‌లో చూసాను. అదే నిజాయితీ ఆనంద్‌లో చూసాను. చాలా బాగా పెర్ఫార్మ్ చేసాడు. అన్న‌య్య‌లాగే మంచి ఫ్యూచ‌ర్ ఉండాల‌ని కోరుకుంటున్నాను. ఈ సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.