సోమవారం, 27 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2019
Written By
Last Updated : సోమవారం, 13 మే 2019 (13:58 IST)

'వృద్ధ సింహం' ధోని పొరబాటు... చెన్నైకి ఐపీఎల్ 2019 టైటిల్‌ను దూరం చేసిందా?

ఫోటో కర్టెసీ-CSK
చెన్నై సూపర్‌కింగ్స్, ముంబయి ఇండియన్స్ మధ్య ఆదివారం రాత్రి జరిగిన ఐపీఎల్-12 ఫైనల్ ప్రేక్షకులను నరాలు తెగే ఉత్కంఠలో ముంచెత్తింది. ఆఖరి బంతి వరకూ కొనసాగిన ఈ మ్యాచ్‌లో ముంబయి కేవలం ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. అద్భుతమైన యార్కర్లకు పెట్టింది పేరైన లసిత్ మలింగ ఆఖరి బంతిని గొప్పగా వేశాడు. చెన్నై బ్యాట్స్‌మన్ శార్దూల్ ఠాకుర్‌ను ఎల్బీడబ్ల్యూ చేశాడు.
 
శార్దూల్ క్రీజులోకి వచ్చేటప్పటికి చెన్నైకి గెలవాలంటే రెండు బంతుల్లో నాలుగు పరుగులు అవసరం. మలింగ వేసిన మొదటి బంతికి శార్దూల్ రెండు పరుగులు తీశాడు. ఇప్పుడు, విజయం కోసం ఒక్క బంతిలో రెండు పరుగులు సాధించాలి. కానీ, మలింగ అద్భుతమైన ఆఫ్ కటర్ వేశాడు. శార్దూల్ ఆ బంతిని ఆడలేకపోయాడు. సరిగ్గా లెగ్ వికెట్ ముందు అది అతడి ప్యాడ్‌ను తాకింది. సంకోచాలేవీ లేకుండా అంపైర్ అది అవుట్ అని తేల్చేశాడు. ముంబయి ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు.
 
శార్దూల్‌ని పంపడం పొరపాటేనా?
డగౌట్‌లో కూర్చున్న చెన్నై ఆటగాళ్లు మాత్రం నిరాశలో కూరుకుపోయారు. హర్భజన్ సింగ్ కోపంతో తన బ్యాట్‌ను ప్యాడ్లకేసి కొట్టుకోవడం ఓ విషయాన్ని చెప్పకనే చెప్పింది. అది.. చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆ ఆఖరి రెండు బంతులు ఆడేందుకు హర్భజన్‌కు బదులుగా శార్దూల్‌ని పంపి పొరపాటు చేశాడని.
 
క్రికెట్ విశ్లేషకుడు విజయ్ లోకపల్లీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ధోని చేసింది పెద్ద పొరపాటని వ్యాఖ్యానించారు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో శార్దూల్ బ్యాటింగ్‌ని దృష్టిలో ఉంచుకుని ధోని ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని మరో విశ్లేషకుడు అయాజ్ మెమెన్ అన్నారు. కానీ, ఏ విధంగా చూసుకున్నా శార్దూల్ కన్నా హర్భజన్‌కు ఎక్కువ అనుభవం ఉంది. ఒత్తిడిని తట్టుకుని ఆడే సామర్థ్యం కూడా హర్భజన్‌కే ఎక్కువ అని అయాజ్ అభిప్రాయపడ్డారు.
 
అయితే, శార్దూల్ యువ ఆటగాడు కాబట్టి జడేజాతో కలిసి సింగిల్స్ వేగంగా తీయగలడని ధోని ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని అయాజ్ అన్నారు. అంతకుమించి, తనకు మరో కారణం తోచడం లేదని చెప్పారు.
 
వాట్సన్ రనౌట్ ఓటమికి ప్రధాన కారణం
చెన్నైని విజయం అంచులవరకూ తీసుకువెళ్లిన షేన్ వాట్సన్ ఆఖరి ఓవర్‌లో రనౌట్ కావడం ఆ జట్టు ఓటమికి ప్రధాన కారణం. క్రితం సారి ఫైనల్లో హైదరాబాద్‌పై అజేయ శతకంతో చెన్నైని అతడు విజేతగా నిలిపాడు. అదే ఇన్నింగ్స్ పునరావృతం అవుతున్నట్లు అనిపించేలా ఆదివారం అతడి బ్యాటింగ్ సాగింది. రనౌట్ కావడానికి ముందు అతడు కేవలం 59 బంతుల్లో 80 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి.
ఫోటో కర్టెసీ-CSK
 
మలింగ వేసిన ఆఖరి ఓవర్ నాలుగో బంతిని డీప్ పాయింట్ వైపు ఆడి వాట్సన్ ఒక పరుగును సునాయాసంగా తీశాడు. కానీ, స్ట్రయికింగ్‌లో తానే ఉండాలన్న ఉద్దేశంతో లేని ఇంకో పరుగు కోసం ప్రయత్నించాడు. ముంబయి ఫీల్డర్ కృనాల్ పాండ్య బంతిని వెంటనే వికెట్ కీపర్ డికాక్‌కు విసిరాడు. స్టంప్స్‌ను కొట్టడంలో డికాక్ అస్సలు ఆలస్యం చేయలేదు. అప్పటికి వాట్సన్ క్రీజ్ లైన్‌కు చాలా దూరంలో ఉన్నాడు. ఈ తప్పే చెన్నై కొంపముంచింది.
 
నిజానికి, వాట్సన్‌తోపాటు క్రీజులో ఉన్న రవీంద్ర జడేజా కూడా హిట్టింగ్ చేయగలడు. ఈ విషయంలో విజయ్ లోకపల్లీ కూడా వాట్సన్‌నే తప్పుపట్టారు. వాట్సన్ గొప్ప ఇన్నింగ్స్ ఆడాడని, అతడిలాంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు మ్యాచ్ గెలిపించకుండా వెనుదిరగాల్సింది కాదని ఆయన అన్నారు. వాట్సన్ ఈ మ్యాచ్‌ను గెలిపించి ఉంటే, ఈ వయసులోనూ వరుసగా జట్టును రెండు ఫైనల్స్‌లో గెలిపించిన ఆటగాడిగా క్రికెట్ ప్రేమికులు చిరకాలం అతణ్ని గుర్తుపెట్టుకునేవారు.
 
ఈ మ్యాచ్ ఫలితం తర్వాత ముంబయి యువజట్టు వృద్ధ సింహాలను ఓడించిందని కొందరు అనొచ్చు. కానీ, ఆ సింహాలు కడవరకూ పోరాడి ఆఖరి బంతిలోనే మ్యాచ్‌ను చేజార్చుకున్నాయన్న విషయం గుర్తుంచుకోవాలి. ముంబయి కోసం 16వ ఓవర్‌ వేసి 20 పరుగులు సమర్పించుకున్న మలింగనే ఆఖరి ఓవర్‌ను అద్భుతంగా వేసి విజయం అందించాడు. అతడు కూడా ముంబయి జట్టులో వృద్ధ సింహమే.
 
-ఆదేశ్ కుమార్ గుప్తా
బీబీసీ ప్రతినిధి