మంగళవారం, 26 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2019
Written By
Last Updated : శనివారం, 11 మే 2019 (13:21 IST)

చెన్నై-ముంబై రికార్డులు.. ఐపీఎల్‌‍లో 150 వికెట్లు పడగొట్టిన భజ్జీ..

కనక వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్‌ ఫైనల్లోకి చెన్నై సూపర్‌కింగ్స్, ముంబై ఇండియన్స్ చేరుకున్నాయి. సీజన్ ఆరంభం నుంచీ అంచనాలకు తగ్గట్టే రాణించిన ఈ రెండు జట్లూ తుది పోరులో తలపడబోతున్నాయి.


ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్లకు మంచి రికార్డులు వున్నాయి. ఇప్పటికే ఈ రెండు జట్లు మూడేసి సార్లు ఛాంపియన్‌గా నిలిచాయి. అంతేగాకుండా... ఎక్కువసార్లు ఫైనల్ చేరిన రికార్డు కూడా ఈ జట్లకే సొంతం.
 
ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరే జట్టుకూ లేదు. దానికి తగట్టే ఎనిమిదిసార్లు ఫైనల్ చేరిన రికార్డు ధోనీసేనకే సొంతం. ధోనీ జట్టులో వుండటం చెన్నైకి సక్సెస్ మంత్రంలా పనిచేసింది.

తన తిరుగులేని కెప్టెన్సీతో జట్టుకు విజయాలందించిన ధోనీ బ్యాట్స్‌మెన్‌గా అదరగొట్టాడు. డాడీస్ ఆర్మీ అంటూ చాలా మంది సెటైర్లు వేసినా… సీనియర్ ఆటగాళ్ళతోనే అత్యుత్తమ ఫలితాలు రాబట్టాడు. దానికి నిదర్శనమే తాజాగా ఎనిమిదోసారి ఫైనల్ చేరుకోవడం. ఇక చెన్నైసూపర్‌కింగ్స్‌పై టైటిల్ పోరులో భారీ అంచనాలే ఉన్నాయి.
 
మరోవైపు ముంబై ఇండియన్స్‌కూ ఐపీఎల్‌లో తిరుగులేని రికార్డుంది. ఈ సీజన్ ఫైనల్లోకి చేరడం ద్వారా ముంబై నాలుగోసారి టైటిల్‌పై కన్నేసింది. కెప్టెన్ రోహిత్‌శర్మ, ఆల్‌రౌండర్ హార్థిక్ పాండ్యా , బౌలర్లు బూమ్రా, మలింగా లాంటి స్టార్లు ముంబైకి పెద్ద బలం.

ఇక చెన్నై కింగ్స్ ఆటగాడు ఐపీఎల్‌లో 150 వికెట్లు పడగొట్టిన నాలుగో బౌలర్‌గా హర్భజన్‌ సింగ్‌ ఘనత సాధించాడు. మలింగ (169), అమిత్‌ మిశ్రా (157), చావ్లా (150) ముందున్నారు.