ఐపీఎల్2020 : కొదమ సింహాల పోరు .. బెంగుళూరు వర్సెస్ హైదరాబాద్

srh - rcb
ఠాగూర్| Last Updated: సోమవారం, 21 సెప్టెంబరు 2020 (09:04 IST)
ఐపీఎల్2020 టోర్నీలోభాగంగా, సోమవారం రాత్రి మూడో మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో రెండు కొదమ సింహాల్లాంటి రెండు జట్లు తలపడనున్నాయి. ఒకటి సన్ రైజర్స్ హైదరాబాద్ కాగా, మరొకటి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్‌లో సమతూకంలో ఉన్న ఇరు జట్ల మధ్య జరుగనున్న ఈ పోటీ రసవత్తరంగా సాగుతుందని భావిస్తున్నారు.

ముఖ్యంగా, ఈ ఇరు జట్లలో ఒక జట్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా ఉంటే, మరో జట్టుకు వార్నర్ సారథిగా ఉన్నాు. నిజానికి ఐపీఎల్‌ అనగానే వార్నర్‌ ఎలా రెచ్చిపోతాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 2016లో తన నాయకత్వంలో హైదరాబాద్‌కు టైటిల్‌ సాధించి పెట్టిన వార్నర్‌కు మరోసారి బెయిర్‌స్టో తోడయ్యాడంటే ప్రత్యర్థికి ముచ్చెమటలే.

వీరు గత సీజన్‌లో ఆర్‌సీబీతో మ్యాచ్‌లోనే టోర్నీ చరిత్రలో మొదటి వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. డేవిడ్‌-స్టో మళ్లీ మెరుపులు మెరిపించడంతోపాటు విలియమ్సన్‌, మనీశ్‌ పాండే, మిచెల్‌ మార్ష్‌ కూడా సత్తా చాటితే హైదరాబాద్‌ భారీ స్కోరు చేయడం ఖాయం. భువనేశ్వర్‌ ఆధ్వర్యంలో పేస్‌, రషీద్‌ ఖాన్‌ నేతృత్వంలో స్పిన్‌ విభాగాలు ప్రత్యర్థులకు సవాల్‌ విసరనున్నాయి.

అలాగే, కోహ్లీ, డివిల్లీర్స్‌వంటి మేటి ఆటగాళ్లతో పటిష్టంగా ఉన్న రాయల్స్‌ బ్యాటింగ్‌ టీ20ల స్పెషలిస్ట్‌ అరోన్‌ ఫించ్‌ చేరికతో మరింత బలపడింది. ఇక.. యువ ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్‌ కూడా అంచనాలను అందుకొంటే బెంగళూరుకు తిరుగుండబోదు. స్టెయిన్‌, ఉమేశ్‌ యాదవ్‌, సైనీలతో పేస్‌, చాహల్‌, జంపాతో స్పిన్‌ విభాగాలు ప్రత్యర్థుల పనిపట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి.

తుది జట్టు బెంగుళూరు (అంచనా)
కోహ్లీ (కెప్టెన్‌), ఫించ్‌, పడిక్కల్‌, డివిల్లీర్స్‌ (కీపర్‌), శివమ్‌ దూబే, మొయిన్‌, సుందర్‌, మోరిస్‌, నవ్‌దీప్‌, చాహల్‌, ఉమేశ్‌.

తుది జట్టు హైదరాబాద్ (అంచనా)
వార్నర్‌ (కెప్టెన్‌), బెయిర్‌ స్టో, మనీశ్‌, విరాట్‌ సింగ్‌, విజయ్‌ శంకర్‌, నబి, రషీద్‌, అభిషేక్‌ శర్మ, భువనేశ్వర్‌, సందీప్‌ శర్మ, ఖలీల్‌.దీనిపై మరింత చదవండి :