గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (16:12 IST)

ఐపీఎల్2020 ప్రారంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌దే బోణి : గంభీర్

ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 2020 టోర్నీపై భారత మాజీ కెప్టెన్ గౌతం గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ విజయం సాధిస్తుందని చెప్పుకొచ్చారు. 
 
ఇదే విషయమై భారత మాజీ క్రికెటర్‌ గంభీర్‌ క్రికెట్‌ కనెక్టెడ్‌ షోలో మాట్లాడుతూ ఈ ఏడాది ఐపీఎల్‌ మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌దే పైచేయి అని అన్నాడు. 'ఈ దఫా ముంబైలో ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రాల బౌలింగ్‌ చూడడానికి నేను ఎదురుచూస్తున్నా. ఎందుకంటే వీరిద్దరూ ప్రపంచ స్థాయి బౌలర్లు. టీ20 క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన వాళ్లు' అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
 
'చెన్నై సూపర్ కింగ్స్‌కు 3వ స్థానంలో బ్యాటింగ్‌ చేయడానికి సురేశ్‌ రైనా లేనందున ఇది చాలా పెద్ద సవాలుగా మారింది. షేన్ వాట్సన్ ఎక్కువ అంతర్జాతీయ క్రికెట్‌లు ఆడలేదు. ప్రాక్టీస్‌ కూడా ఈ మధ్యే మొదలు పెట్టాడు. అతను బుమ్రా, ట్రెంట్ బౌల్ట్‌లను ఎదుర్కోగలడా? ధోని బ్యాటింగ్‌ కూర్పు ఎలా ఉంటుందో చూడాలి'  అని గంభీర్ చెప్పుకొచ్చాడు. 
 
'జట్టులో సమతుల్యత, లోపాలు చూస్తే మొదటి మ్యాచ్‌ ముంబై ఇండియన్స్ గెలుస్తుందని నేను భావిస్తున్నా. వారు ఈసారి ట్రెంట్‌ బౌల్ట్‌ను కూడా జట్టుతో చేర్చుకున్నారు. మంచి బ్యాటింగ్‌ లైనప్‌తో పాటు బౌలింగ్‌ కూడా బలంగా ఉంద'ని చెప్పుకొచ్చాడు. 
 
కాగా, గతేడాది రోహిత్ శర్మ నేతృత్వంలోని ఎంఐ.. ఫైనల్లో ఎంఎస్ ధోని నాయకత్వంలోని సీఎస్‌కేను 1 పరుగు తేడాతో ఓడించి ట్రోఫీని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈసారి ముంబైతో తొలిమ్యాచ్‌ ఆడనున్న సీఎస్‌కే ఎలాగైనా విజయం సాధించి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.