గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 13 సెప్టెంబరు 2020 (16:44 IST)

ఐపీఎల్‌ 2020 ఆరంభ మ్యాచ్‌కు గైక్వాడ్ దూరం.. ఐసోలేషన్‌లో రుతురాజ్

Ruturaj gaekwad
కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌లో ఆడే చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే)కు కరోనాతో తంటాలు తప్పట్లేదు. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ చెందిన ఇద్దరు ఆటగాళ్లు ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. చెన్నై బృందంలోని 13 మందికి కరోనా సోకగా ఇప్పటికే 12 మంది సభ్యులు బయో బబుల్‌లోకి వచ్చేశారని ఫ్రాంఛైజీ తెలిపింది. 
 
పేసర్‌ దీపక్‌ చాహర్‌ కరోనా నుంచి కోలుకొని ప్రాక్టీస్‌ కూడా మొదలెట్టాడు. మరో బ్యాట్స్‌మన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ ఇంకా వైరస్‌ నుంచి కోలుకోకపోవడంతో ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నాడు. యువ క్రికెటర్‌కు మరో రెండుసార్లు కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ రెండింటిలోనూ ఫలితం నెగెటివ్‌గా తేలితేనే బయోబబుల్‌లోకి అతడు ప్రవేశించే అవకాశం ఉంటుంది. 
 
ఈ నెల 19న అబుదాబిలో ముంబై ఇండియన్స్‌తో సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ 2020 ఆరంభ మ్యాచ్‌కు గైక్వాడ్‌ దూరం కానున్నట్లు తెలుస్తున్నది. అతడు ఇప్పటి వరకు నెట్‌ సెషన్‌లోనూ పాల్గొనలేదు. సెలక్షన్‌కు అందుబాటులో ఉండాలంటే అతడు ఫిట్‌నెస్‌ పరీక్షలో పాస్‌కావాల్సి ఉంటుంది.