సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 అక్టోబరు 2020 (20:10 IST)

ఐపీఎల్ 2020 : 'హిట్ మ్యాన్' ఖాతాలో అరుదైన రికార్డు

యూఏఈ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. గత నెల 19వ తేదీన ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. అయితే, ఈ పోటీల్లో ఇప్పటివరకు జరిగిన లీగ్ మ్యాచ్‌లు సూపర్‌గా టీవీ వ్యూవర్‌షిప్‌ను సొంతం చేసుకున్నాయి. దీంతో ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ఈ మ్యాచ్‌లపై అమితాసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డును చేరుకున్నాడు. 
 
గురువారం ముంబై, కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ క్రమంలోనే హిట్‌మ్యాన్‌ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌ చరిత్రలో ఐదువేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో విరాట్‌ కోహ్లీ, సురేశ్‌ రైనా మాత్రమే ఈ ఫీట్‌ను సాధించారు. ఈ మ్యాచ్‌ రెండో ఓవర్‌లో బౌలర్ మహ్మద్ షమీ వేసిన బంతిని బౌండరీకి తరలించడంతో ఐదు వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు.
 
క్రికెట్‌లో హిట్ మ్యాన్‌గా గుర్తింపు పొందిన రోహిత్ శర్మ ఖాతాలో ప్రస్తుతం 4,998 పరుగులు ఉన్నాయి. ఈ పరుగులకు తోడు మరో రెండు రన్స్ కొట్టడంతో ఐదు వేల పరుగుల క్లబ్‌లో చేరాడు. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు కెప్టెన్ విరాట్‌ 5,430 పరుగులతో టాప్‌ కొనసాగుతుండగా.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాడు సురేష్రైనా 5,368 ర‌న్స్‌తో రెండో స్థానంలో నిలిచాడు. దీంతో పంజాబ్‌తో మ్యాచ్‌లో రోహిత్‌ కేవలం రెండు పరుగులు చేయడంతో ఈ ఘనత సాధించిన మూడో ఆటగాడిగా నిలిచాడు. 
 
కాగా, విరాట్ కోహ్లీ 180 మ్యాచ్‌ల్లో 37.12 సగటుతో 5,430 పరుగులు చేయగా, సురేష్ రైనా మాత్రం 193 మ్యాచ్‌ల్లో 33.34 సగటుతో 5,368 పరుగులు రాబట్టాడు. వ్యక్తిగత కారణాలతో ప్రస్తుత సీజన్‌ నుంచి రైనా తప్పుకున్న విషయం తెలిసిందే. అలాగే, పంజాబ్ జట్టుపై రోహిత్ 600 పరుగులు చేశాడు. ఇలా ఐపీఎల్ టోర్నీలో 600 పరుగులు పూర్తి చేయడం ఇది ఐదో జట్టు కావడం గమనార్హం.