బుధవారం, 27 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2020
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 23 సెప్టెంబరు 2020 (09:12 IST)

కొడితే స్టేడియం పైకప్పే తగలాల్సిందే... ఆకాశమే హద్దుగా రాయల్స్.. సీఎస్కే ఓటమి!

ట్వంటీ20 మ్యాచ్ అంటే ఇది. ఆ మ్యాచ్‌లో ఉండే మజా ఏంటో తెలియని వారికి మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్ చూసివుంటే తెలిసొచ్చివుంటుంది. బ్యాట్స్‌మెన్లు ఆకాశమే హద్దుగా చెలిరేగిపోయారు. బంతిని కొడితే పైకప్పే ఎగిరిపోయింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు దెబ్బకు స్టేడియం దద్ధరిల్లిపోయింది. తొలుత సంజూ శాంసన్, మధ్యలో స్మిత్, చివర్లో ఆర్చర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. 
 
దీంతో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓడిపోయింది. అంతేకాకుండా, ఐపీఎల్‌లో టైటిల్ వేటకు తాను కూడా రేసులో ఉన్నానని రాజస్థాన్ రాయల్స్ నిరూపించింది. తనదైన రోజున ఎటువంటి జట్టునైనా ఓడించే సత్తా తనకుందని చాటుతూ, ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది.
 
ఈ టోర్నీలో ముంబై ఇండియన్స్‌ను ఓడించిన ఉత్సాహంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్, ఈ మ్యాచ్‌లో ఓడిపోయి తొలి పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో మొత్తం 33 సిక్సర్లు నమోదు కావడం విశేషం. అంతేకాదు... 2010 తర్వాత ఐపీఎల్‌లో చెన్నై జట్టుపై తొలుత బ్యాటింగ్‌కు దిగి, రాజస్థాన్ రాయల్స్ గెలవడం కూడా ఇదే తొలిసారి.
 
తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. సంజూ శాంసన్ 32 బంతుల్లో 1 ఫోర్, 9 సిక్స్‌లతో 74 పరుగులు చేశాడు. కెప్టెన్ స్మిత్ 47 బంతుల్లో 4 ఫోర్లు, నాలుగు సిక్సుల సాయంతో 69, జోఫ్రా ఆర్చర్ 8 బంతుల్లో నాలుగు సిక్సర్లతో 27 బాదడంతో భారీ స్కోరు నమోదైంది. శామ్సన్, స్మిత్ రెండో వికెట్‌కు 57 బంతుల్లోనే 121 పరుగులు జోడించడం గమనార్హం. 
 
మరోవైపు కెప్టెన్ స్టీవెన్ స్మిత్ (47 బంతుల్లో 69 పరుగులు... 4 ఫోర్లు, 4 సిక్సులు) కూడా తనవంతు బాధ్యతగా ఆడి అర్ధసెంచరీ నమోదు చేశాడు. సంజూ అవుటయ్యాక స్కోరు బోర్డు నిదానించినట్టు కనిపించినా, చివర్లో జోఫ్రా ఆర్చర్ విధ్వంసం సృష్టించాడు. 8 బంతులు ఎదుర్కొన్న ఆర్చర్ 4 భారీ సిక్సులతో 27 పరుగులు చేసి నాటౌట్‌గా మిగిలాడు. చెన్నై బౌలర్లలో శామ్ కరన్ 3 వికెట్లు తీశాడు. చహర్, ఎంగిడి, చావ్లా తలో వికెట్ తీశారు.
 
వన్‌డౌన్‌లో వచ్చిన సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బంతిని స్టేడియం బయటకు కొట్టేద్దామన్నంత ఊపుతో బ్యాటింగ్ చేసిన ఈ కేరళ కుర్రాడు 32 బంతుల్లోనే 74 పరుగులు సాధించాడు. సంజూ స్కోరులో 1 ఫోర్ మాత్రమే నమోదు కాగా, సిక్సర్లు మాత్రం 9 నమోదయ్యాయి. బౌండరీ లైన్ కాస్త చిన్నదే అయినా, సంజూ కొట్టిన షాట్లు స్టేడియం పైకప్పును తాకాయంటే ఎంత బలంగా కొట్టాడో అర్థం చేసుకోవచ్చు.
 
ముఖ్యంగా, టీమిండియాలో రెగ్యులర్‌గా ఆడే రవీంద్ర జడేజా బౌలింగ్‌ను సంజూ ఊచకోత కోశాడు. వరుసగా సిక్సర్లు బాదుతుంటే జడేజా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. పియూష్ చావ్లాను కూడా వదలకుండా బాదిన సంజూ చివరికి లుంగి ఎంగిడి బౌలింగ్‌లో ఆఫ్ సైడ్ భారీ షాట్ కొట్టబోయి ఫీల్డర్ చేతికి చిక్కాడు.
 
ఆపై 217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్, భారీ లక్ష్య ఛేదనలో తడబడింది. తొలుత వాట్సన్ కాస్తంత దూకుడుగా ఆడినప్పటికీ, విజయ్, కరణ్, జాదవ్ తదితరులు రాణించక పోవడంతో టాప్ ఆర్డర్ కుప్పకూలింది. తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన రుతురాజ్ గోల్డెన్ డక్ అయ్యాడు. 
 
ఆపై డుప్లెసిస్ దూకుడుగా ఆడినా ప్రయోజనం లేకపోయింది. చివరి 38 బంతుల్లో 103 పరుగులు చేయాల్సిన స్థితిలో, 16 పరుగులు తక్కువయ్యాయి. ధోనీ 17 బంతుల్లో 3 సిక్సర్లతో 29 పరుగులు చేసి నాటౌ‌ట్‌గా నిలవడం ఒక్కటే, ఈ మ్యాచ్ లో చెన్నై అభిమానులకు కాస్తంత ఆనందం కలిగించే అంశం.