1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2021
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 సెప్టెంబరు 2021 (09:41 IST)

ఎంఐతో ఆర్సీబీ ఫైట్.. హర్షల్ పటేల్ హ్యాట్రిక్

Harshal Patel
ఐపీఎల్ 2021లో భాగంగా దుబాయ్ వేదికగా ముంబై ఇండియన్స్ (ఎంఐ)తో జరిగిన మ్యాచులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) పేసర్ హర్షల్ పటేల్ హ్యాట్రిక్ తీశాడు. ఇన్నింగ్స్ 17వ ఓవర్లో హర్షల్ పటేల్ హ్యాట్రిక్ పడగొట్టాడు. 17వ ఓవర్ మొదటి బంతికి హార్దిక్ పాండ్యా (3)ను, రెండో బంతికి కీరన్ పోలార్డ్ (7), మూడో బంతికి రాహుల్ చహర్ (0)లను ఔట్ చేసి హ్యాట్రిక్ ఘనత అందుకున్నాడు. 
 
దాంతో ఐపీఎల్ టోర్నీలో ఆర్‌సీబీ తరఫున హ్యాట్రిక్ తీసిన మూడో బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందు ప్రవీణ్ కుమార్ (రాజస్థాన్ రాయల్స్ 2010), శామ్యూల్ బద్రీ (ముంబై ఇండియన్స్ 2017)లు బెంగళూరు తరఫున హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టారు.
 
ఇక ఐపీఎల్ టోర్నీలో హ్యాట్రిక్ తీసిన 20వ బౌలర్‌గా హర్షల్ పటేల్ రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ టోర్నీలో మొదటగా హ్యాట్రిక్ తీసింది లక్ష్మిపతి బాలాజీ. 2008లో అప్పటి కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టుపై బాలాజీ హ్యాట్రిక్ పడగొట్టాడు. అమిత్ మిశ్రా, మఖయ ఎంతినిలు కూడా 2008లోనే ఈ ఫీట్ అందుకున్నారు. 2009లో యువరాజ్ సింగ్ రెండు సార్లు, రోహిత్ శర్మ ఓసారి హ్యాట్రిక్ తీశారు. 
 
ప్రవీణ్ కుమార్ (2010) అమిత్ మిశ్రా (2011), అజిత్ చండీలా (2012), 2013లో అమిత్ మిశ్రా, సునీల్ నరైన్ హ్యాట్రిక్ పడగొట్టారు. 2014లో ప్రవిన్ తాంబే, షేన్ వాట్సన్.. 2016లో అక్షర్ పటేల్.. 2017లో శామ్యూల్ బద్రి, ఆండ్రూ టై మరియు జయదేవ్ ఉనద్కట్.. 2019లో సామ్ కరన్, శ్రేయస్ గోపాల్ హ్యాట్రిక్ తీశారు.