రంజాన్ ఉపవాస దీక్ష.. 30 రోజులు దానధర్మాలు చేయాలి

ramzan
Selvi| Last Updated: శనివారం, 19 జులై 2014 (15:23 IST)
రంజాన్ నెలలో పూర్తి 30 రోజులు ఉపవాస దీక్ష పాటించాలి. సూర్యోదయం కంటే ముందే నిర్ధారిత సమయంలో ఆహార పానీయాలు తీసుకోవాలి. దీనిని ‘సహర్’ అంటారు. రంజాన్ ఉపవాసదీక్ష, నిరాహర, నిర్జల దీక్ష. ఉపవాస దీక్ష సమయంలో మందులు, మాకులు, ఇంజక్షన్లు, స్లైన్లు సైతం నిషేధం. పాన్, గుట్కా, సిగట్, బీడీలాంటి ధూమపానాలు కూడా నిషేధం.

సూర్యాస్తమ సమయంలో ప్రతిరోజూ కొన్ని నిమిషాల తేడాతో ఉపవాస దీక్ష విరమణ నిర్దేశించడమైనది. దీన్ని ‘ఇఫ్తార్’ అంటారు. తియ్యని ఖర్జూరాలు, ఇతరత్రా ఫలాలతో ఉపవాస దీక్ష విరమిస్తారు. సహార్ మరియు ఇఫ్తార్ సమయాన్ని పూర్వకాలంలో ఆకాశంలో వెలుగు రేఖల్ని బట్టి నిర్ధారించేవారు.

ఆధునిక సమాజంలో ప్రత్యేకంగా మోగే సైరన్లు ఉండటం సౌకర్యకరంగా మారింది. ఉపవాస దీక్షా సమయంలో విధిగా నమాజులు చేయాలి. ఇఫ్తార్ సమయంలో దీక్షా వాసులకి ఎవరైనా ఇఫ్తార్ ఏర్పాటు చేస్తే ఉపవాసం వల్ల ఆ వ్యక్తికి ఎంత పుణ్యమైతే లభిస్తుందో అంతే పుణ్యం లభిస్తుంది.

ఉపవాస దీక్ష కేవలం ఆహారం, నీరు తీసుకోకపోవడమే కాదు. దీక్షాపరులు అన్నిరకాల చెడు కార్యాలు, అధర్మ కార్యాలకు దూరంగా ఉండాలి. కామ కోరికలు మనసులోకి రానివ్వకూడదు. దీక్షాకాలంలో అల్లాహ్ స్మరణ, నమాజులు చేస్తూ, దానధర్మాలు నిర్వహిస్తూ, తనకు తాను అంతర్గతంగా ఆత్మ ప్రక్షాళన చేసుకుంటూ ఉండాలి.

రంజాన్ లేదా ‘రమాదాన్’ అనే అరబ్బీ పదానికి మండించడం లేదా దహించడం అని అర్థం. అంటే మనిషి తన మనసులోని కామ, క్రోధ, మదమోహమాత్సర్యాలను, స్వార్థ చింతనను, అనైతిక, అధర్మ దుర్గుణాలు దహింపచేసుకోవడమని అర్థం.

బీదలు పడే ఆకలి దప్పుల బాధ ఎలా ఉంటుందో ధనవంతులకు, ఉపవాసాల మూలంగా అనుభవంలోకి వస్తుంది. రంజాన్ నెలలో చేసే జకాత్/సద్కా (దానధర్మాలు) వల్ల బీదలకు ధనధాన్యాలు, దుస్తులు బీదలకు లభిస్తాయి.దీనిపై మరింత చదవండి :