ఉచితంగా కోవిడ్ టెస్టులు.. మెయిల్స్ వస్తే ఓపెన్ చేయొద్దు.. జాగ్రత్త సుమా!
కరోనా వైరస్ నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారు. కరోనా వైరస్ సోకకుండా ప్రజలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని లాక్ డౌన్ పాటిస్తూ ఇళ్లల్లో ఉంటే సైబర్ నేరగాళ్లు కోవిడ్ టెస్టుల పేరుతో ప్రజలను దోచేయటం మొదలెట్టారు. మీకు కోవిడ్ -19 పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని చెప్పి మెయిల్స్ పంపిస్తున్నారు.
పొరపాటున మీకేదైనా అలాంటి ఈ-మెయిల్ వచ్చిందంటే దాన్ని ఓపెన్ చేయకూడదని సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మెయిల్స్‌ను ఓపెన్ చేస్తే వ్యక్తిగత, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని హ్యాకర్ల చేతిలో పెట్టినట్లు అవుతుందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు.
కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖ కింద సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షించే నోడల్ ఏజెన్సీ అయిన ది ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్.. సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా వుండాలని హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికే దేశంలో అనేకమంది వ్యాపారులు, వ్యక్తులు సైబర్ నేరగాళ్ల మోసాలకు గురయ్యారని ఒక వేళ అలాంటి ఈ-మెయిల్స్ వస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అలాంటి ఈ-మెయిల్స్ వస్తే మీకు వస్తే వాటిని తక్షణమే డిలీట్ చేయాలని వారు సూచిస్తున్నారు.
ప్రపంచమంతా కరోనా భయంలో వణికిపోతుంటే... సైబర్ నేరగాళ్లు మాత్రం ప్రభుత్వ ఏజెన్సీలు, శాఖలు పంపినట్టుగా ఇలాంటి ఫిషింగ్ మెయిల్స్‌ను పంపించి అమాయకుల వ్యక్తిగత, ఆర్థిక సమాచారాన్ని తస్కరించేందుకు ప్రయత్నిస్తున్నారని సైబర్ సెక్యూరిటీ టీమ్ పేర్కొంది. మీకు తెలియని, సంబంధంలేని విషయాలకు సంబంధించిన మెయిల్స్ వస్తే వెంటనే https://www.cert-in.org.in/ సమాచారం పంపాలని సూచిస్తున్నారు.