1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 16 జులై 2022 (14:47 IST)

శుభవార్త చెప్పిన ఫేస్‌బుక్ : ఒకే వ్యక్తి పేరుతో ఐదు ప్రొఫైల్స్

తన యూజర్లకు ఫేస్‌బుక్ శుభవార్త చెప్పింది. ఒకే వ్యక్తి పేరుతో ఐదు ప్రొఫైల్స్ పెట్టుకునేందుకు అనుమతి ఇచ్చింది. సోషల్‌ మీడియాలో పిల్లలపై నిఘా పెట్టేందుకు తల్లిదండ్రులు వారికి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పంపుతుంటారు. పిల్లలు మాత్రం తమ సోషల్‌ మీడియా ఫ్రెండ్స్‌ జాబితాలో తల్లిదండ్రులు ఉండకూడదని కోరుకుంటారు. 
 
దీంతో కుటుంబసభ్యుల కోసం, ఫ్రెండ్స్‌ కోసం అంటూ వేర్వేరు సోషల్‌ మీడియా ఖాతాలను ఉపయోగిస్తుంటారు. అలాంటి వారికి మెటా సంస్థ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఫేస్‌బుక్‌లో ఒకే ఖాతాతో ఐదు ప్రొఫైల్స్‌ క్రియేట్‌ చేసుకునేందుకు వీలుగా కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ పరీక్షల దశలో ఉందని, త్వరలోనే యూజర్లకు పరిచయం చేస్తామని మెటా సంస్థ వెల్లడించింది.   
 
'సోషల్ మీడియాలో తమకు నచ్చిన కంటెంట్‌ను షేర్‌ చేయడంలో కొంత మంది యూజర్లు ఫ్రెండ్స్‌ జాబితాలో కుటుంబసభ్యులు, బంధువులు ఉన్నారనే కారణంతో సంకోచిస్తుంటారు. దీంతో వారు తమ ఇష్టాయిష్టాలకు అనుకూలంగా ఒకటి కన్నా ఎక్కువ ఖాతాలు ఉపయోగిస్తున్నారు. అలాంటి వారు ఒకే ఖాతాతో ఐదు వేర్వేరు ప్రొఫైల్స్‌ పెట్టుకునేలా కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తున్నాం' అని మెటా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.