బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి

మరోసారి వివాదంలో ట్విట్టర్.. కేంద్రంతో వార్ తప్పదా?

సోషల్ మీడియా అగ్రగామి ట్విట్టర్ మరోసారి వివాదంలో చిక్కుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఐటీ నిబంధనల ప్రకారం యూజర్ల సంఖ్య 50 లక్షలు దాటితే సోషల్ మీడియా సంస్థలు ఫిర్యాదుల పరిష్కారానికి ఓ అధికారిని నియమించి, ఆ వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆ అధికారి తప్పనిసరిగా ఇండియాలో నివాసం ఉండే వ్యక్తై ఉండాలి. 
 
అయితే ట్విట్టర్ తీసుకున్న తాజా నిర్ణయం ఈ నిబంధనకు పూర్తి వ్యతిరేకంగా ఉంది. అమెరికాకు చెందిన ఉద్యోగిని ఇండియాలో గ్రీవెన్స్ అధికారిగా ట్విట్టర్ నియమించింది. ఈ నియామకాన్ని భారత ప్రభుత్వం అంగీకరించలేదు.
 
ఇదిలా ఉంటే ఇంతకు ముందు తాత్కాలిక గ్రీవెన్స్ అధికారిగా ఉన్న ధర్మేంద్ర చతుర్ ఆదివారం రాజీనామా చేయడం కూడా సంచలనంగా మారింది. బాధ్యతలు తీసుకుని నెల కూడా తిరక్క ముందే ఆయన రాజీనామా చేయడంతో మరొకరిని గ్రీవెన్స్ ఆఫీసర్‌గా నియమించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలోనే అమెరికా ఉద్యోగికి ఇండియాలో గ్రీవెన్స్ అధికారిగా బాధ్యతలు అప్పగించింది. 
 
భారత ప్రభుత్వం రూపొందించిన నూతన ఐటీ నిబంధనలను అంగీకరించడంలో ట్విట్టర్ తాత్సారం చేసింది. గడువు ముగిసిన ఆరు రోజులకు భారత్‌లో తాత్కాలిక గ్రీవెన్స్ అధికారిని నియమించినట్లు ఢిల్లీ హైకోర్టు ముందు మే 31న ట్విట్టర్ ప్రకటించింది.
 
ట్విటర్‌ వంటి దిగ్గజ సంస్థలు గ్రీవెన్స్ అధికారితోపాటు ఓ నోడల్‌ అధికారి, స్థానిక ఫిర్యాదుల అధికారిని కూడా నియమించాలసి ఉంటుంది. ఈ అధికారులంతా భారత్‌లో నివసించేవారై ఉండాలి. దీనికి విరుద్ధంగా అమెరికా ఉద్యోగిని నియమించడంతో కేంద్ర ప్రభుత్వం, ట్విట్టర్ మధ్య మరోసారి వివాదం తలెత్తనున్నట్లు తెలుస్తోంది.