శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్

ఇపుడు ఐబీఎం వంతు... 3900 మంది ఉద్యోగుల తొలగింపుకు నిర్ణయం

it company
మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే టెక్ దిగ్గజాలైన గూగుల్, మైక్రోసాఫ్ట్‌తో పాటు ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌ వంటి కంపెనీల్లో ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ నిరంతరాయంగా సాగుతోంది. ఇపుడు ఐబీఎం వంతు వచ్చింది. ఈ ఐటీ దిగ్గజ కంపెనీలో ఏకంగా 3900 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. అసెట్ డిజిన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. 
 
అయితే, ఈ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగుల్లో తొలగించిన ఉద్యోగుల సంఖ్య కేవలం 1.5 శాతం మాత్రమేనని పేర్కొంది. అయితే, క్లయింట్ ఫేసింగ్ రీసెర్స్ డెవలప్‌మెంట్ విభాగాల్లో నియామకాలు కొనసాగుతున్నాయని ఐబీఎం చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జేమ్స్ కవనాగ్ తెలిపారు. 
 
ఐబీఎం తీసుకున్న తాజా నిర్ణయంతో ఆ కంపెనీ షేర్లు ఏకంగా రెండు శాతం పడిపోయాయి. మరోవైపు, ఉద్యోగులను తొలగించాలని ఐబీఎం తీసుకున్న నిర్ణయం వెనుక ప్రధాన కారణం ఉందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాల్లో కంపెనీ నగదు లక్ష్యాలు అందుకోలేక పోవడమే కారణమని వారు అభిప్రాయపడుతున్నారు.