శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 ఆగస్టు 2020 (10:51 IST)

కంపెనీలకు వరంగా మారిన వర్క్ ఫ్రమ్ హోమ్.. ఎలాగంటే?

కరోనా వైరస్ కారణంగా ఉద్యోగులు చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా పలు సంస్థలు లాభాలను ఆర్జిస్తున్నాయి. గతానికంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న సంస్థలు అధిక ఉత్పాదకతను పొందుతున్నాయి. ఐటీ కంపెనీలకు వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఎప్పటి నుంచో ఉంది. అయితే.. మొదట్నించి ఈ విధానంపై ఒకలాంటి నెగిటివ్ భావన ఎక్కువ. 
 
ఆఫీసుకు వస్తేనే ఎక్కువగా పనిచేస్తారని.. ఇంట్లో ఉంటే నిర్లక్ష్యం చేస్తారన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. కానీ కరోనా పుణ్యమా అని ఐటీ కంపెనీలతోపాటు.. చివరకు మీడియా సంస్థలు సైతం తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వక తప్పలేదు. కానీ తాజాగా వర్క్ ఫ్రమ్ హోమ్‌తో నష్టం జరగలేదని.. లాభాలు వస్తున్నాయని అదిరిపోయే వాస్తవాలు బయటకు వచ్చింది.
 
గడిచిన ఐదు నెలలుగా వర్క్ ఫ్రం హోం నడిపిస్తున్న కంపెనీలు.. తమ ఉద్యోగుల ఉత్పాదకత భారీగా పెరిగినట్లుగా గర్తించారు. ఈ విధానానికి సంబంధించి ఒక సంస్థ తాజాగా సర్వే నిర్వహించింది. ఇందులో పేర్కొన్న అంశాలు ఆసక్తికరంగా మారాయి.
 
ఇంటి నుంచే పనిచేసే విధానంలో ఆఫీసుకు వెళ్లేందుకు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవటం.. ఈ కారణంగా గంటల కొద్దీ సమయం పోయేది. ఇందుకు భిన్నంగా ఇంట్లోనే ఉండటంతో.. ఆఫీసు పని వేళల కంటే ముందే.. తమ కంప్యూటర్ల ముందుకు ఉద్యోగులు వచ్చేస్తున్నారు. దీంతో.. ఉద్యోగులు మరింత ఎక్కువ సమయాన్ని పని కోసం వెచ్చిస్తున్నట్లు తేల్చారు. ఇంటి నుంచి పని చేసే విధానంలో 52 శాతం మంది గతానికి మించి తాము ఎక్కువ పని గంటల్ని ఆఫీసు కోసం వెచ్చిస్తున్నట్లు తేల్చారు.
 
అంతేకాదు… ఉద్యోగుల మారిన తీరు కారణంగా కంపెనీల ఉత్పాదకత కూడా మారింది. గతానికి మించి 66 శాతం ఉత్పాదకత మారినట్లుగా కంపెనీలు చెబుతున్నాయి. ఆఫీసుల్లో పని చేసే సమయాల్లో టీ కోసం.. కోలీగ్స్‌తో ముచ్చట్ల కోసం చాలా సమయాన్ని వెచ్చించేవారని.. ఇప్పుడు అవన్నీ తగ్గిపోయినట్లుగా చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితి తాము ఎదుర్కొంటున్నట్లుగా 78 శాతం మంది ఉద్యోగులు చెప్పగా.. ఆఫీసును మిస్ అవుతున్నట్లుగా 66 శాతం మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.