జియోతో పబ్‌జీతో చర్చలు.. భారత్‌లోకి రీ ఎంట్రీ ఇస్తుందా?
చైనా గేమింగ్ యాప్ అయిన పబ్ జీపై భారత సర్కారు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ సంక్షోభం, చైనా సరిహద్దు ఉద్రిక్తతలు, భద్రతా పరమైన కారణాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 69 ఏ ప్రకారం పలు చైనా యాప్లను నిషేధించింది. అందులో భాగంగానే పబ్జీని కూడా నిషేధించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఈ మొబైల్ గేమ్ పబ్‌జీ భారతీయ వినియోగదారులకు తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చర్చల్లో ఉన్నట్టు తెలుస్తోంది. రిలయన్స్ టెలికాం విభాగం జియోతో పబ్‌జీ కార్పొరేషన్‌తో చర్చలు జరుపుతున్నట్లు తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది.
దీనికి సంబంధించిన చర్చలు ప్రస్తుతం ప్రారంభ దశలో ఉన్నాయని, ఇరు సంస్థలు కొనుగోలు ఒప్పందంపై తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. దీనికి సంబంధించిన ఒప్పంద సాధ్యాసాధ్యాలను లీగల్ టీం పరిశీలిస్తోంది. ప్రధానంగా రెండు అంశాలపై దృష్టినట్టు సమాచారం.
పబ్‌జీని దక్షిణ కొరియాకు చెందిన బ్లూ హోల్ స్టూడియోస్ సంస్థ రూపొందించింది. భారత్‌లో దీనిపై నిషేధం విధించడంతో చైనా కంపెనీ నుంచి బ్లూహోల్ ఫ్రాంచైజీని ఉపసంహరించుకుంది. చైనా కంపెనీ టెన్సెంట్ గేమ్స్ నుంచి తాను విడిపోతున్నట్లు ప్రకటించింది. దీంతో పబ్‌జీపై ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు జియో రంగంలోకి దిగింది. అయితే దీనిపై ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.