పబ్జీతో సహా 118 యాప్‌లపై నిషేధం - కేంద్రం ఆదేశాలు
ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అనేక మంది చిన్నారుల ప్రాణాలను తీస్తున్న ఆన్‌లైన్ గేమింగ్ యాప్ పబ్జీతో సహా మొత్తం 118 యాప్‌లపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ నిర్ణయం తీసుకుంది. వీటిలో మెజార్టీ యాప్‌లు చైనాకు చెందినవే కావడం గమనార్హం.
ఈ మొబైల్ యాప్‌లు దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు, భద్రతకు, ప్రజా జీవితానికి హానికరంగా పరిణమించాయంటూ కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. పబ్జీ, లివిక్, పబ్జీ మొబైల్ లైట్, వుయ్ చాట్ వర్క్, వుయ్ చాట్ రీడింగ్ వంటి పలు యాప్‌లు కేంద్రం విడుదల చేసిన నిషిద్ధ యాప్‌ల జాబితాలో ఉన్నాయి. కేంద్రం ఇంతకుముందే టిక్ టాక్, హలో వంటి యాప్‌లను నిషేధించిన సంగతి తెలిసిందే.
కాగా, పబ్జీపై నిషేధం విధించినట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించడంతో.. భారత్‌లో ఈ గేమింగ్ యాప్‌ను అందుబాటులో లేకుండా గూగుల్ ప్లే స్టోర్ నుంచి, యాపిల్ ప్లే స్టోర్ నుంచి తొలగించారు. పబ్జీ యాప్‌ను మన దేశంలో దాదాపు 50 మిలియన్ల మందికి పైగా వినియోగిస్తున్నారు.