సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 సెప్టెంబరు 2020 (10:30 IST)

పగబట్టిన పాము.. ఒకే నెలలో 8 సార్లు కాటేసింది.. ఆ వ్యక్తి మృత్యుంజయుడు

పాము పగ మామూలుగా వుండదనేందుకు ఈ ఘటనే నిదర్శనం. ఓ వ్యక్తిని వెంటాడుతున్న పాము అతనిని ఎనిమిది సార్లు కాటేసింది. కాటేసిన ప్రతిసారీ మృత్యువు అంచుల దాకా వెళ్లి బతుకుతున్నాడు ఆ వ్యక్తి. చివరికి ఆ పాము బారిన పడి రోజు నరకయాతన అనుభవిస్తున్నానని.. పాము నుంచి దేవుడే తనను రక్షించాలని వాపోతున్నాడు. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లా రాంపూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. 17 ఏళ్ల యశ్‌రాజ్ మిశ్రాకు పాము గండం పట్టుకుంది. ప్రతీ క్షణం పాము భయం వెంటాడుతోంది. ఎక్కడికి వెళ్లినా, ఏ పని చేసినా ఉలిక్కి పడుతున్నాడు. పాము కారణంగా మిశ్రాకు నిద్రకూడా పట్టట్లేదు. ఎంత జాగ్రత్తగా ఉన్నా పాము అతన్ని వదలట్లేదు. ఒకే నెలలో ఎనిమిది సార్లు అతన్ని ఆ పాము కాటేసింది. ఆగస్ట్ 25న 8వసారి కాటేసింది. ఆ పామును ఎలాగైనా వదిలించుకోవాలని వెతికి మరీ పాముల్ని పట్టుకునే సంస్థకు కాల్ చేశాడు. 
 
వాళ్లొచ్చినప్పుడు ఎంత వెతికినా పాము కనిపించలేదు. పామును వదిలించుకోవడం తన వల్ల కాదని డిసైడైన మిశ్రా... మూడుసార్లు కాటేసిన తర్వాత... బహదూర్‌పూర్‌లో ఉన్న తన బంధువుల ఇంటికి వెళ్లాడు. అదేం చిత్రమో గానీ... అక్కడికీ వచ్చి మరీ పాము కాటేసింది.
 
దాంతో... ఇక తాను బంధువుల ఇంట్లో ఉండటం వ్యర్థమని మళ్లీ సొంతూరికే వచ్చాడు. అక్కడ మరో నాలుగుసార్లు వేటు తప్పలేదు. ఇంట్లోవాళ్లు చాలా భయపడుతున్నారు. చుట్టుపక్కల వాళ్లు భయపెడుతున్నారు. ఇందులో చిత్రమేమిటంటే.. ఇన్నిసార్లు కాటేసినా మిశ్రా చనిపోలేదు. అలాగని అది విషం లేని పాము కూడా కాదు. కాకపోతే విషస్థాయి తక్కువగా ఉంది. 
 
దానికి తోడు డాక్టర్ తగిన ఇంజెక్షన్లు ఇస్తూ కాపాడుతున్నాడు. ఇంతకీ ఎందుకు అతన్నే కాటేస్తోందో తెలియట్లేదు. అతను గానీ, కుటుంబ సభ్యులు గానీ... పాములకు ఏ హానీ చెయ్యలేదనీ, ఎప్పుడూ ఏ పామునీ చంపలేదని చెబుతున్నారు. మరి ఈ పాము పగకు కారణం ఏంటో తెలియరాలేదు. 
 
పాము పగ పట్టి ఉంటుందని, స్థానిక పూజారుల సూచన మేరకు పూజలు కూడా చేశాం. అయినా లాభంలేకుండా పోయింది. ఆ పాము మావాణ్ని ఏం చేస్తుందోనని భయంగా ఉంది. మావాడిని ఆ పైవాడే కాపాడాలి' అని యశ్‌రాజ్ అమ్మానాన్నలు కన్నీరుమున్నీరవుతున్నారు.